Suicide: అర్ధరాత్రుల్లో ఫోన్లేంటని మందలించినందుకు తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య...!
- తన స్కూల్‌లోని పీఈటీతో అదే పనిగా ఫోన్‌లో మాట్లాడుతుందని కుమార్తెకు మందలింపు
- కోపంతో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య
- తమ కుమార్తె మరణానికి పీఈటీ కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
అర్ధరాత్రుల్లో ఫోన్లేంటని తల్లిదండ్రులు మందలించినందుకు ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని శనివారం తెల్లవారుజామున ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోని చిల్కూరు ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల్లోకెళితే... నగరంలోని చిల్కూరు ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో సదరు బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. తాను చదివే స్కూల్‌లో పీఈటీగా పనిచేసే వ్యక్తితో ఆమె అర్ధరాత్రుల్లో అదే పనిగా ఫోన్‌లో మాట్లాడటం లేదా అతనికి మెసేజ్‌లు పంపుతుండటాన్ని తల్లిదండ్రులు గమనించారు.
ఇలాంటివి పక్కనపెట్టి బుద్ధిగా చదువుకోమని ఆమెను వారు పలుమార్లు గట్టిగా మందలించారు. అయినా సరే వారి మాటలను ఆమె పెడచెవిన పెట్టింది. చివరకు వారి ఆక్షేపణలకు కోపగించుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. కాగా, తమ బిడ్డ చనిపోవడానికి పీఈటీ కారణమని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దైనందిన కార్యక్రమాల్లో బిజీ అయిపోయినా సరే.. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని, వారిని ముందు నుంచే సక్రమ పద్ధతుల్లో పెంచకుంటే చివరకు ఇలాంటి విపత్పరిణామాలు ఎదురవుతాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.