ugadi: మీరంతా రేపు ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తారు: ప్రధాని మోదీ
- శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నరేంద్ర మోదీ సందేశం
- ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో ఉగాదిని పవిత్రంగా జరుపుకుంటారు
ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశం ఇచ్చారు. ప్రజలను నేరుగా కలిసే అవకాశం లేనందున సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మాట్లాడుతున్నానని తెలిపారు. భారతదేశంలోనే శ్రీశైలం ఒక దివ్యక్షేత్రమని, అక్కడ జరిగే ప్రత్యక్ష కార్యక్రమాలను వీక్షించేందుకు భక్తులు కాలినడకన తరలివస్తారని అన్నారు. ఉగాది యుగాదికి ఆరంభమని, సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో ప్రారంభమవుతుందని చెప్పారు.
ఈ రోజున జీవిత గమ్యాన్ని నిర్దేశించుకుని దాని కోసం ఎంతటి సాహసాన్నయినా చేయాలని పిలుపునిచ్చారు. రేపు మీరంతా ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తారని మోదీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో ఉగాదిని పవిత్రంగా జరుపుకుంటారని చెప్పారు. ఉగాది సందర్భంగా కొత్త కార్యక్రమాలు చేపడతారని చెప్పారు.