Shiv sena: టీడీపీ దెబ్బతో శివసేనతో మంతనాలు ప్రారంభించిన బీజేపీ!
- ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన బీజేపీ
- ఇప్పటికే కటీఫ్ చేసుకున్న శివసేన
- నష్ట నివారణకు బీజేపీ చర్యలు
- ఉద్ధవ్ థాకరేతో సీఎం ఫడ్నవిస్ మంతనాలు?
విభజన హామీలు నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ భాగస్వామ్య కూటమి ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. మిత్రపక్షాలను మళ్లీ మంచి చేసుకునే పనిలో పడింది. మిత్రపక్షమైన టీడీపీ తాజాగా బీజేపీతో తెగదెంపులు చేసుకోగా, మహారాష్ట్రలోని శివసేన ఇప్పటికే కటీఫ్ చెప్పేసింది. భవిష్యత్తులో మరిన్ని పార్టీలు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుండడంతో బీజేపీ రంగంలోకి దిగింది.
మహారాష్ట్రలో శివసేనను మళ్లీ మంచి చేసుకునే పనిలో పడింది. అందులో భాగంగా ‘మహా’ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేను ఏకాంతంగా పిలిచి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో కలుసుకున్న వీరిద్దరూ తాజా రాజకీయ పరిణామాలపై చాలాసేపు మాట్లాడుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మోదీ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా మోదీ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరేను ఫడ్నవిస్ అభ్యర్థించినట్టు శివసేన వర్గాలు తెలిపాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఉద్ధవ్‌ను తాను కలవలేదని ఫడ్నవిస్ కొట్టిపడేశారు. కాగా, శివసేనకు 18 మంది ఎంపీలున్నారని, వారంతా తమ వెంటే ఉంటారని బీజేపీ భావిస్తుండగా, బీజేపీకి తాము రాంరాం చెప్పేశామని, వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలోకి దిగుతామని శివసేన తేల్చి చెప్పింది.