Chandrababu: 11 పార్టీలతో చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్.. మహానాడు తర్వాత ప్రకటన.. రిపబ్లిక్ టీవీ సంచలన కథనం!

  • ఇప్పటికే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు
  • ఏప్రిల్ 7న ఫ్రంట్ తొలి సభ
  • ప్రస్తుతం 90 మంది ఎంపీల బలం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్నారా? అంటే, అవుననే అంటోంది జాతీయ న్యూస్ చానల్ రిపబ్లిక్ టీవీ. విభజన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కూటమి నుంచి బయటకు వచ్చిన టీడీపీ నుంచి వచ్చే నెలలో జాతీయ రాజకీయాలను మలుపుతిప్పే కీలక ప్రకటన రాబోతోందని తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే 11 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారని, అమరావతిలో వచ్చే నెలలో నిర్వహించనున్న మహానాడులో ఈ విషయాన్ని ప్రకటించనున్నారని రిపబ్లిక్ టీవీ తన కథనంలో పేర్కొంది.

ఎన్డీయే నుంచి బయటకు రాకముందే చంద్రబాబు ఈ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారని, దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నేతలతో ఫోన్‌లో మంతనాలు జరుపుతున్నారని జాతీయ చానల్ తన కథనంలో పేర్కొంది. బాబు మాట్లాడిన వారిలో శరద్ పవార్ (ఎన్సీపీ), అఖిలేశ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), మాయావతి (బీఎస్పీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), నవీన్ పట్నాయక్ (బిజూ జనతాదళ్), ఎంకే స్టాలిన్ (డీఎంకే), ఫరూక్ అబ్దుల్లా (జమ్ముకశ్మీర్), ఓం ప్రకాశ్ చౌతాలా (ఇండియన్ నేషనల్ లోక్‌దళ్), అరవింద్ కేజ్రీవాల్ (ఆమ్ ఆద్మీ పార్టీ) తదితర నేతలు ఉన్నారు. మహానాడు అనంతరం ఏప్రిల్ 7న యునైటెడ్ ఫ్రంట్ తొలి సభ జరగనుందని చానల్ తన కథనంలో వివరించింది. కాగా, ప్రస్తుతం ఆయా పార్టీలకు ఉన్న ఎంపీల ప్రకారం.. యునైటెడ్ ఫ్రంట్‌కు 90 మంది ఎంపీల బలముంది.

  • Loading...

More Telugu News