shivsena: 2019 ఎన్నికల్లో బీజేపీ నంబర్ 100-110 దగ్గరే ఆగిపోతుంది: శివసేన జోస్యం
- యూపీలో ఏడాది క్రితమే ఘన విజయం
- ఇంతలోనే వారి కోటకు బీటలు పడ్డాయేమి?
- ప్రజలు అన్నీ చూస్తున్నారని వ్యాఖ్య
ఎన్డీయే మాజీ మిత్ర పక్షం శివసేన మరోసారి బీజేపీపై నిప్పులు చెరిగింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య 100-110 దగ్గరే ఆగిపోతుందని పేర్కొంది. ఈ మేరకు పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయాన్ని ప్రచురించింది. ‘‘బీజేపీకి కంచుకోట అయిన రెండు చోట్ల గోరఖ్ పూర్, ఫూల్పూర్ లోక్ సభ స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ గెలవడం, చిన్న రాష్ట్రం త్రిపురలో విజయోత్సవ సంబరాలను జరుపుకుంటున్న ఆ పార్టీలో భయానికి దారితీసిందని పేర్కొంది.
"ఏడాది క్రితమే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మరి అంతలోనే వారి కోటకు బీటలు పడ్డాయేమి?’’ అని ప్రశ్నించింది. ‘‘2014లో ప్రచార హోరు సామాన్య ప్రజల కళ్లు, చెవులను కప్పేసింది. దాంతో బీజేపీ విజయం సాధ్యమైంది. కానీ, ఇప్పుడు అదంతా కరిగిపోయింది. ప్రజలు ప్రతిదీ స్పష్టంగా చూస్తున్నారు’’ అని సంపాదకీయంలో పేర్కొంది.