lingayat: కర్ణాటకలో ప్రత్యేక మతం సెగలు.. దిక్కుతోచని స్థితిలో సిద్ధూ!
- రోజురోజుకూ తీవ్రతరమవుతున్న లింగాయత్ మతం వివాదం
- రెండు వర్గాలుగా చీలిపోయిన మంత్రులు, స్వామీజీలు
- దిక్కుతోచని స్థితిలో సిద్ధరామయ్య ప్రభుత్వం
కర్ణాటకలో లింగాయత్ ప్రత్యేక మతం అంశం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర రాజకీయాలను శాసించగలిగే స్థాయిలో ఉండే లింగాయత్ కులాన్ని ప్రత్యేక మతంగా చేయాలని కొందరు, చేయకూడదంటూ మరికొందరు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో మంత్రులు, స్వామీజీలు, మఠాధిపతులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు.
లింగాయత్ లకు ప్రత్యేక మతానికి సంబంధించి నాగమోహన్ దాస్ నివేదికను అమలు చేయాలనుకుంటే... రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలను చేపడతామని బాగల్ కోటె లోని విరక్తి మఠాధీశుడు చంద్రశేఖర శివాచార్య స్వామీజీ సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మరోవైపు, లింగాయత్ లకు చెందిన స్వామీజీలు కూడా రెండు వర్గాలుగా చీలిపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఈ అంశం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో, సిద్ధరామయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, ప్రకటనలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రివర్గ సమావేశాన్ని సైతం ఆయన వాయిదా వేశారు.