KCR: కేసీఆర్ కు మరోమారు సవాల్ విసిరిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి
- ముగిసిన 48 గంటల నిరాహార దీక్ష
- కేసీఆర్ కు ధైర్యం ఉంటే నల్గొండలో నాపై పోటీ చేసి గెలవాలి
- నేను ఓడిపోతే రాజకీయాలకు స్వస్తి చెబుతా
- కేసీఆర్ ను గద్దె దించేందుకు కార్యకర్తలు పని చేయాలి : కోమటిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పై దాడి ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వాలు రద్దయిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరిట కోమటిరెడ్డి, సంపత్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష ఈరోజు ముగిసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ కు ధైర్యం ఉంటే నల్గొండలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరైనా సరే తనపై పోటీ చేయాలని అన్నారు. తాను ఓడిపోతే రాజకీయాలకు స్వస్తి చెబుతానని పేర్కొన్న కోమటిరెడ్డి, కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని పిలుపు నిచ్చారు.