Pawan Kalyan: లాలూచీ రాజకీయాలతో నన్ను విమర్శిస్తారా! : పవన్ పై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు
- లాలూచీ రాజకీయాలతో నన్ను విమర్శిస్తున్నారు
- నన్ను బలపర్చాల్సిన వాళ్లు బలహీనపరుస్తారా?
- నిజం నిప్పులాంటిది .. నిప్పుతో చెలగాటమాడొద్దు
- తెలుగు జాతికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: చంద్రబాబు
జనసేన పార్టీ వార్షికోత్సవ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ లపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు లాలూచీ పడ్డారంటూ పవన్ కల్యాణ్ పేరెత్తకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాలూచీ పడ్డ వారెవరో త్వరలోనే బయటపెడతానని, అన్నిటికీ రెండు, మూడ్రోజుల్లో సమాధానం చెబుతానని అన్నారు.
‘కేంద్రంపై నేను పోరాడుతున్నాను. దేని కోసం పోరాడుతున్నాం? నాలుగేళ్లుగా కేంద్రాన్ని అడిగాను. ఈ నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీ తిరిగాను. ‘నాది బలహీనత’ అని కొంతమంది అంటున్నారు. నాది ధర్మం. మిత్రధర్మం. 29 సార్లు తిరిగిన తర్వాత, నాలుగేళ్లపాటు ప్రయత్నం చేసిన తర్వాత సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో, విధిలేని పరిస్థితిలో పోరాటం ప్రారంభించాను. ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నాను.
పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు, ఏపీలో మనం పోరాడుతుంటే.. ఒక్కొక్కరూ ఒక్కొక్క లాలూచీ రాజకీయాలతో నన్ను విమర్శిస్తున్నారు. ఏపీకి ప్రధాని అన్యాయం చేస్తున్నారని నేను గళం విప్పినప్పుడు, నన్ను బలపర్చాల్సిన మీరు (విమర్శించే వాళ్లు) బలహీనపరుస్తారా? అది రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం లాభం చేకూర్చదు. తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానీకానికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెబుతున్నాను. ఎన్నో రాజకీయాలను చూశాను. ఎంతో మంది ఎన్నో విధాలుగా లాలూచీ పడ్డారు. ఎవరెన్ని చేసినా ‘ట్రూత్ ఈజ్ ట్రూత్’. నిజం నిప్పులాంటిది. నిప్పుతో చెలగాటమాడాలని చూడొద్దు భవిష్యత్ లో ఎవరికీ కలిసి రాదు’ అని చంద్రబాబు భావోద్వేగం చెందారు.