Chandrababu: పవన్ విమర్శల వెనుక మోదీ హస్తం... ఇక ఎదురుదాడికి దిగండి, వ్యక్తిగత విమర్శలు వద్దు: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశం
- నేతలందరూ దీటుగా స్పందించండి
- ఆయన పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేయవద్దు
- జగన్ ను, పవన్ ను మోస్తున్న నరేంద్ర మోదీ
- ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దీటుగా స్పందించాలని చంద్రబాబునాయుడు తన నేతలను కోరారు. గత రాత్రి ఆయన ప్రసంగం తరువాత టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, నేడు ఉదయం మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ విమర్శల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని ఆరోపించిన ఆయన, ఓ పథకం ప్రకారం బుదరజల్లే ప్రయత్నాలు మొదలయ్యాయని అన్నారు. ఆయన విమర్శలు, ఆరోపణలపై ఎదురుదాడికి దిగాలని, అయితే, ఆయన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని మాత్రం ఎటువంటి విమర్శలూ చేయవద్దని సూచించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణకూ సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
తమిళనాడులో చేస్తున్నట్టుగానే ఏపీలోనూ రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించిన ఆయన, నరేంద్ర మోదీ తన భుజాలపై ఓకవైపు పవన్ ను, మరోవైపు జగన్ ను మోస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. తన ప్రసంగంలో ఒక్కసారైనా ప్రధాని నరేంద్ర మోదీ పేరునైనా తలవని పవన్, లోకేష్ పై ఆరోపణలు చేయడం బాధను కలిగించిందని అన్నారు. ఎన్నింటినో త్యాగం చేసిన లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడని, అన్యాయం చేసిన వారిని వదిలేసి, పోరాడుతున్న వారిపై మాటల దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.