Uttar Pradesh: సోషల్ మీడియాలో మోదీ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం బహిర్గతం...యువకుడి అరెస్టు
- మోదీ వారణాసి టూర్ సోషల్ మీడియాలో బహిర్గతం
- మినిట్ టు మినిట్ ప్రోగ్రాంను ఫేస్ బుక్ లో పోస్టు చేసిన అనూప్ పాండే
- ఎస్పీజీ పోలీసుల ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రధాని టూర్ వివరాలను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసిన యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వారణాసికి చెందిన అనూప్ పాండే అనే యువకుడు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా టీంలో రెండేళ్ల క్రితం పని చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా ఫాలో అవుతున్న 1932 మందిలో అనూప్ పాండే ఒకరు కావడం విశేషం. అనారోగ్య కారణాలతో ఆయన తిరిగి వారణాసి చేరుకున్నారు. తాజాగా ప్రధాని వారణాసి పర్యటన మినిట్-టు-మినిట్ వివరాలను ఆయన ఫేస్ బుక్ ద్వారా బహిర్గతం చేశారు. దీనిపై ఎస్పీజీ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆయనను అరెస్టు చేశారు.