Pawan Kalyan: పవన్ కల్యాణ్ అలా మాట్లాడతారని నేను అనుకోలేదు : టీడీపీ నేత రాజేంద్రప్రసాద్

  • పవన్ జెంటిల్ మెన్ అని ఇన్నాళ్లూ అనుకున్నాం
  • ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు
  • వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యనిస్తే సహించం : రాజేంద్రప్రసాద్ హెచ్చరిక

టీడీపీపై, ఆ పార్టీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుప్పించిన ఆరోపణలపై తెలుగుదేశం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ‘పవన్ కల్యాణ్ అలా మాట్లాడతారని నేను అనుకోలేదు. ఎందుకంటే, బేసికల్ గా ఆయన అలాంటి వ్యక్తి కాదు. జెంటిల్ మెన్.. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని ఇన్నాళ్లూ మేము అనుకున్నాం. అందుకనే, మా పార్టీ, మా నాయకులు ఆయనకు అత్యంత గౌరవం, ప్రాధాన్యత ఇచ్చాం. కానీ, ఈరోజున పవన్ కల్యాణ్ చాలా బాధ్యతారాహిత్యంగా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు. ‘లోకేశ్ కు శేఖర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి..ఎమ్మెల్యేలు ఇసుక దోచేస్తున్నారు.. అవినీతిలో నెంబర్ వన్ ఆంధ్రా’ అని పవన్ ఆరోపించారు.

నాలుగేళ్ల నుంచి ఈ విషయం పవన్ కల్యాణ్ గారికి తెలియదా? మాతోనే ఆయన కలిసి తిరిగారుగా? చంద్రబాబుగారికి నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర. మచ్చలేని రాజకీయ జీవితాన్ని చంద్రబాబు గడుపుతున్నారు. లక్ష కోట్లు దోచేసిన దొంగల కంటే చంద్రబాబు చాలా బెటరని భావించడం వల్లేగా పవన్ కల్యాణ్ నాడు మాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లింది? మరి, ఈరోజున ఇలా మాట్లాడటమేంటి? పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు చూస్తే.. అది  ఆయన మాట్లాడినట్టుగా అనిపించడం లేదు.

ఎవరో ఘోస్ట్ రైటర్స్, ఆయన పక్క నుండి తప్పుడు సమాచారమిచ్చి, తప్పుదోవ పట్టించినట్టుగా కనపడుతోంది. ఏదేమైనప్పటికి, ఈ మాటలు పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చాయి కనుక ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఈ విషయమై పార్టీలో మేము చర్చిస్తాం. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే ఎటువంటి పరిస్థితిలో మేము సహించం. పవన్ మాట్లాడిన దానికంటే ఎక్కువగానే మేము మాట్లాడగలం. మాకు చాలా విషయాలు తెలుసు’ అని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan
Telugudesam
rajendraprasad
  • Loading...

More Telugu News