Chandrababu: మంత్రి లోకేశ్ చేసిన అవినీతి గురించి చంద్రబాబుకి తెలియదా?: పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు
- 2014లో మీతో నేను కలిసి ఉన్నప్పుడు మోదీ ప్రజలతో ఒక మాట అన్నారు
- ఆంధ్రప్రదేశ్ స్కాం ఏపీ కాకుండా ఉండాలంటే తమకు ఓటేయాలని అన్నారు
- ఈ రోజు స్కాం ఆంధ్రా అవ్వలేదు కానీ టీడీపీ నాయకుల వల్ల అవినీతి ఆంధ్ర మాత్రం అయింది
- వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవడానికి ఇప్పటికే కోట్లు సర్దేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ మంత్రి లోకేశ్‌తో పాటు టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. "నేను ముఖ్యమంత్రిని ఓ మాట అడుగుతున్నాను.. 2014లో మీతో నేను కలిసి ఉన్నప్పుడు ప్రజలతో మోదీ ఒక మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కాం ఏపీ కాకుండా ఉండాలంటే తమకు ఓటేయాలని అన్నారు. ఈ రోజు స్కాం ఆంధ్రా అవ్వలేదు కానీ టీడీపీ నాయకుల వల్ల అవినీతి ఆంధ్రా మాత్రం అయింది. ఏం అవినీతి అండీ ఇది. ఇసుక ఉచితమని ప్రజలకు చెప్పి లారీ 15 వేల రూపాయలు చేశారు. భవన నిర్మాణాల ఖర్చుని పెంచేశారు. 2019లో మేము టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేయాలి?
మీరు దోపిడీ చేస్తోంటే చూస్తూ ఉండడానికా మీకు మేము సపోర్ట్ చేసింది? 2014లో.. అనుభవజ్ఞుడు కావాలని చంద్రబాబుకి అండగా నిలబడ్డాం. మీ పిల్లల అవినీతి మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరెప్షన్.. లోకేశ్ అవినీతి. ఎంత కరెప్షన్ అంటే నేనో మాట చెబుతాను.. అదేంటంటే నేను 2006లోనో ఎప్పుడో ఒక ప్రముఖ కళాకారుడు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు. ఆయన ఒకరోజు చెప్పింది ఏంటంటే ఆదివాసీల ఇంటికి వెళ్లామని చెప్పారు. అక్కడ ఓ ఇంట్లో ఎన్టీఆర్ ఫొటో పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ఫొటో ఎందుకు పెట్టుకున్నారని అడిగితే ఆయన రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారని, ఆయన ఓ మహానుభావుడని చెప్పారు. మరి ఆ మహానుభావుడి మనవళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు.
బాధగా లేదా.. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు. మీ హెరిటేజ్ కంపెనీలోంచయితే డబ్బులు తీయడం లేదు. మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవడం లేదు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? 2019 ఎన్నికల్లో నేను తమకు మద్దతిస్తానో లేదో తెలియక ఏపీలో వైసీపీని ఎదుర్కోవడానికి ప్రతి నియోజక వర్గానికి పాతిక కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ డబ్బంతా సర్దేశామని, ఎక్కడ దాచిపెట్టాలో అక్కడ పెట్టేశామని నిర్మొహమాటంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.
మీరు చేసే పనులు చూస్తే టంగుటూరి ప్రకాశం, ఎన్టీఆర్ లాంటి వారి మహానుభావుల ఆత్మ ఘోషిస్తుంది. లోకేశ్ చేస్తోన్న అవినీతి చంద్రబాబు నాయుడికి కనపడడం లేదా?ఆయనకు తెలిసే లోకేశ్ అవినీతి చేస్తున్నారా. ముఖ్యమంత్రికి ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి చాలా ఎక్కువగా ఉంది. ఒక ఆర్గనైజేషన్ కూడా వెల్లడించింది. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలని చంద్రబాబుకు ఇటీవలే చెప్పాను. ఇటువంటి పనులు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. 2019లో ప్రజలు సరికొత్త నాయకులని ఎన్నుకుంటారు" అని అన్నారు.