MP Mahendra singh: ఆ ఎంపీ పేరులోనే కాదు...సంపదలోనూ కింగే...!
- బీహార్‌కి చెందిన ఎంపీ కింగ్ మహేంద్ర ఆస్తి రూ.4 వేల కోట్లు
- జేడీ(యూ) అభ్యర్థిగా రాజ్యసభకు పోటీ..అఫిడవిట్‌లో విస్మయపరిచిన ఆస్తుల వివరాలు
- అత్యధిక దేశాలు చుట్టిన ఎంపీగా కూడా ఘనత
రాజకీయాల్లోకి వచ్చి పదవులను అలంకరించిన నేతల ఆస్తులు అమాంతం పెరిగిపోతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. బీహార్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్ అలియాస్ కింగ్ మహేంద్ర రూ.4 వేల కోట్ల ఆస్తితో (ప్రస్తుతానికి) దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా అవతరించారు. బీహార్ రాష్ట్రంలో రాజ్యసభకు ఆయన జేడీ(యూ) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ తరపున పోటీ చేయడం ఆయనకిది మూడోసారి కావడం గమనార్హం. ఏడోసారి పార్లమెంటులో ప్రవేశించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. కింగ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో చరాస్తులు రూ.4010.21 కోట్లుగా, స్థిరాస్తులు రూ.29.1 కోట్లుగా చూపించారు.
కింగ్ మహేంద్ర తనకున్న రెండు ఫార్మా కంపెనీలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో టర్మ్ డిపాజిట్లు రూ.2239 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే రూ.41 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే ఇంత సంపన్న ఎంపీ అయిన మహేంద్ర పేరుపై వాహనాలు గానీ బీమా పాలసీలు గానీ లేకపోవడం గమనార్హం. 2016-17ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఆయన తన ఆదాయాన్ని రూ.303.5 కోట్లుగా ప్రకటించారు.
కాగా, మహేంద్ర తొలిసారిగా 1980లో పార్లమెంటులో ప్రవేశించారు. కాంగ్రెస్ టికెట్‌పై జెహనాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మొదటిసారి గెలుపొందారు. మరోవైపు ఆయనకు అత్యధిక దేశాలు పర్యటించిన ఎంపీగా కూడా పేరుంది. మొత్తం 211 దేశాలను ఆయన చుట్టారు. ఏప్రిల్ 9, 2002 నుంచి ఏప్రిల్ 8, 2003 మధ్యకాలంలో ఆయన ఏకంగా 84 దేశాల్లో పర్యటించడం విశేషం.