Nepal: అయోమయంతో చేజేతులా విమానాన్ని కూల్చేసిన పైలెట్!
- రెండు రోజుల క్రితం కాట్మండులో ఘోర ప్రమాదం
- 50 మంది దుర్మరణం
- ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సూచనలు పాటించని పైలట్
రెండు రోజుల క్రితం నేపాల్ రాజధాని కాట్మండూలోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగిన ఘోర విమాన ప్రమాదం వెనుక సాంకేతికపరమైన లోపాలేమీ లేవని విచారణ బృందం తేల్చింది. విమానం ల్యాండింగ్ సమయంలో పైలెట్ లో నెలకొన్న ఆయోమయంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. విమానాన్ని దింపే సమయంలో పక్కకు తిప్పాలని తాను చెప్పినా, పైలట్ వినలేదని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విచారణ అధికారుల ముందు వాగ్మూలం ఇచ్చాడు. పైలట్ కన్ ఫ్యూజన్ లో సరిగ్గా ల్యాండింగ్ చేయలేక ప్రమాదానికి కారకుడయ్యాడని తెలిపారు.
కాగా, ఢాకా నుంచి కాట్మాండుకు 67 మందితో వెళుతున్న విమానం కుప్పకూలిన ప్రమాదంలో 50 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, పైలట్‌కు మధ్య జరిగిన సంభాషణలో తికమక కారణంగానే అంతమంది ప్రాణాలు పోయాయని, వారి సంభాషణ చాలా అయోమయంగా సాగిందని ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ సంస్థ తన వెబ్ సైట్ లో వెల్లడించింది. ల్యాండ్ అయ్యే సమయంలో విమానం పైలట్ 'తాము దిగొచ్చా?' అని ప్రశ్నించాడని, అప్పటికే ఆలస్యం అయిందని తెలుసుకున్న కంట్రోలర్ వణుకుతున్న స్వరంతో 'వెనక్కు వెళ్లిపో' అని చెప్పినట్టు రికార్డ్ అయిందని, దాన్ని పట్టించుకోని పైలట్ ల్యాండింగ్ చేస్తుండగానే, ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది ఫైర్ సిబ్బందిని వేగంగా రన్ వేవైపు వెళ్లాలని ఆదేశించాడని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని, కొద్దిమంది ప్రాణాలను మాత్రమే కాపాడగలిగామని తెలిపింది. రన్ వేకు తగ్గట్టుగా విమానం రాలేదని ఎయిర్ పోర్టు జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ చేత్రి వెల్లడించారు.