Andhra Pradesh: చూస్తుంటే బీజేపీ, వైసీపీ కలసిపోయినట్టే ఉన్నాయి: అసెంబ్లీలో యనమల

  • రెండు పార్టీలూ ఒకేలా మాట్లాడుతున్నాయి
  • ఏపీకి నిధుల గురించే మాట్లాడతారేంటి?
  • మనం కట్టిన పన్నుల గురించి చెప్పరేం?
  • విష్ణుకుమార్ రాజుపై యనమల విమర్శలు

ఏపీ అసెంబ్లీలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు, బయట ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలను వింటుంటే, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కలసిపోయినట్టుగానే కనిపిస్తున్నాయని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో పాల్గొన్న ఆయన, అవగాహన లేకపోవడంతోనే రాష్ట్రానికి ఎన్నో నిధులు ఇచ్చామని విష్ణుకుమార్ రాజు చెబుతున్నారని అన్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఇచ్చిన నిధుల గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు, ఏపీ నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల గురించి కూడా చెప్పాలని ప్రశ్నించారు.

కాగా, నేటి ఉదయం నుంచి కేంద్రం ఇచ్చిన నిధులపై టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. 2014 నుంచి ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ కు రూ. 2,17,198 కోట్లను కేంద్రం ఇచ్చిందని ప్రభుత్వం గణాంకాలను సమర్పించింది. అవన్నీ రాజ్యాంగం ప్రకారం వచ్చేవేనని, ప్రత్యేకంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునేవి కాదని అన్నారు.

అంతకుముందు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, కేంద్రం నుంచి తీసుకున్న నిధుల ఖర్చు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం రహస్యాలు ఎందుకు పాటిస్తోందని ప్రశ్నించారు. లెక్కలు చెప్పడానికి భయమెందుకని అడిగారు. కేంద్రం అన్యాయం చేస్తోందని చెప్పడం భావ్యం కాదని, అన్ని రకాల సాయం కేంద్రం నుంచి అందుతూనే ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News