KTR: పట్టణాల పురోగతికి మరిన్ని నిధులు ఇస్తాం: మంత్రి కేటీఆర్
- జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్
- టీయూఎఫ్ఐడీసీ నుంచి పట్టణాలకు నిధులు
- ప్రస్తుతం అందుతున్న నిధులకు అదనంగా ఈ నిధులు
- పకడ్బందీ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు పోతుంది
పట్టణాల పురోగతికి టీయూఎఫ్ఐడీసీ ( తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ప్రాస్ట్రక్టర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ద్వారా మరిన్ని నిధులు ఇవ్వనున్నట్లు మంత్రి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఈ రోజు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పట్టణాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ది కార్యక్రమాల కోసం టీయూఎఫ్ఐడీసీ ద్వారా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇప్పటికే పట్టణాలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రత్యేక నిధులు ఇస్తుందని చెప్పారు.
తెలంగాణలో సుమారు 39 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉందని, త్వరలో ఏర్పడనున్న నూతన పురపాలికలతో ఈ శాతం మరింతగా పెరుగుతుందని అన్నారు. పట్టణాలను పక్కా ప్రణాళికలతో అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల అవసరాల మేరకే పట్టణాల్లోని మౌలిక వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. నూతనంగా ఏర్పడ్డ కొత్త జిల్లాల కేంద్రాలు, ఇతర పట్టణాలను ప్రణాళిక బద్ధంగా పక్కా రోడ్డు మ్యాపుతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్లకు సూచించారు.
పట్టణాలకు టీయూఎఫ్ఐడీసీ ద్వారా ఇస్తున్న నిధులను నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యేలా పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని, పట్టణంలో చేపట్టాల్సిన పనుల విషయంలో సిద్దిపేట పట్టణాన్ని ఒక రోల్ మాడల్ గా తీసుకోవాలని సూచించారు. పట్టణంలోని జంక్షన్ టూ జంక్షన్ రోడ్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, ఫుట్ పాత్స్, బస్ బేలు, మురికి కాలువల అభివృద్ధి, శ్మశాన వాటికలు, పార్కుల అభివృద్ధి మొదలైన కార్యక్రమాలను చేపట్టాలని, ఈ పనులు పూర్తి చేస్తే పట్టణాల్లో గుణాత్మక మార్పు వస్తుందని అన్నారు.
కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకోవాలి
కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకోవాలని, ఆ విధంగా చేస్తే అభివృద్ది పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని, తెలంగాణలో ఉన్న ప్రతి పట్టణానికి ఒక ఫేస్ లిప్ట్ ఉండేలా అధికారులు పనిచేయాలని, టీయూఎఫ్ఐడీసీ పనులను పర్యవేక్షించే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ ఈ మొత్తం పనులను పర్యవేక్షిస్తుందని చెప్పారు. టీయూఎఫ్ఐడీసీ నిధులతో ఏఏ పనులు చేపట్టనున్నారో సాద్యమైనంత త్వరగా గుర్తించి, మార్చి నెలాఖరు నాటికి చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్లు అందించాలని ఆదేశించారు. ప్రతి పనికి గడువు పెట్టుకోవాలని, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు క్షేత్రస్ధాయితో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించాలని, ఈ పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు.