Lesotho Legend: చరిత్రలో ఐదో అతిపెద్ద డైమండ్ ఎంతకు అమ్ముడైందో తెలుసా..?
- 910 క్యారెట్ల బరువైన లెసోథో లెజెండ్ వజ్రం
- దీని సైజు రెండు గోల్ఫ్ బంతులంత..
- దీనిని లెట్‌సెంగ్ గనిలో గుర్తించామన్న జెమ్ డైమండ్స్
చరిత్రలోనే ఐదో అతిపెద్ద వజ్రంగా గుర్తించబడిన డైమండ్ ఆంట్వెర్ప్ నగరంలో నిర్వహించిన వేలంపాటలో 40 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడయింది. ఈ వజ్రం బరువు 910 క్యారెట్లు. దీని పేరు లెసోథో లెజెండ్ అని జెమ్ డైమండ్స్ లిమిటెడ్ తెలిపింది. ఈ వజ్రం చూడటానికి రెండు గోల్ఫ్ బంతులంత పరిమాణంలో ఉందని, దీనిని ఆఫ్రికా దేశమైన లెసోథోలోని తమ లెట్‌సెంగ్ గనిలో గుర్తించామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఓ వజ్రాన్ని ఇంత భారీ మొత్తానికి విక్రయించడం జెమ్ కంపెనీకిదే మొదటిసారి కావడం గమనార్హం. ఇతర కంపెనీలు గతంలో కొన్ని వజ్రాలను ఇంతకంటే ఎక్కువ మొత్తానికి విక్రయించాయి.
ఉదాహరణకు, లుకారా డైమండ్ కార్పొరేషన్ గతేడాది 813 క్యారెట్ల వజ్రాన్ని 63 మిలియన్ డాలర్లకు విక్రయించింది. 1109 క్యారెట్ల వజ్రాన్ని 53 మిలియన్ డాలర్లకే అమ్మింది. ఇది చరిత్రలోనే రెండో అతిపెద్ద వజ్రం కావడం విశేషం. కాగా, లెట్‌సెంగ్ గని భారీ సైజు వజ్రాలకు పెట్టింది పేరు. జెమ్ కంపెనీ 2015లో 357 క్యారెట్ల వజ్రాన్ని 19.3 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ఇక 2016లో 603 క్యారెట్ల లెసోథో ప్రామీస్ అనే డైమండ్‌ను గుర్తించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జెమ్ కంపెనీ 100 క్యారెట్ల కంటే ఎక్కువ పరిమాణమున్న ఆరు డైమండ్లను గుర్తించింది.