Chandrababu: బీసీలకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు : కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ
- బీసీలను చంద్రబాబు పట్టించుకోవడం లేదు
- రాజ్యసభకు ఎంపిక చేసిన ఇద్దరు టీడీపీ సభ్యులు అగ్రవర్ణానికి చెందిన వారే!
- వెనుకబడిన, బలహీనవర్గాల వారికి మొండిచేయి చూపించారు
- చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన శివాజీ
బీసీలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరని అన్యాయం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆరోపించారు. ‘టీడీపీకి బీసీలే వెన్నెముక’ అంటూ వల్లమాలిన ప్రేమ కురిపించిన చంద్రబాబునాయుడు, తన చేతిలోకి అధికారం వచ్చాక బీసీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజ్యసభకు ఎంపిక చేసిన ఇద్దరు టీడీపీ సభ్యులు అగ్రవర్ణానికి చెందిన వారేనని అన్నారు. సీఎం రమేశ్ వంటి వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లకు రెండో సారి అవకాశం ఇచ్చారు కానీ, ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న బీసీలు, దళిత నాయకులకు అవకాశమివ్వకపోవడం దారుణమని అన్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు ముందు సామాజిక సమతుల్యత పేరిట పార్టీ నాయకులతో సమీక్షలు జరిపిన చంద్రబాబునాయుడు, వెనుకబడిన, బలహీన వర్గాల వారికి మొండిచేయి చూపించారని, ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే బీసీల గురించి మాట్లాడటం చంద్రబాబుకు అలవాటైపోయిందని మండిపడ్డారు.