Telangana: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ... కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్!

  • ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం
  • అడ్డుకుంటామని అంటున్న కాంగ్రెస్ సభ్యులు
  • సభ జరిగినన్ని రోజులూ సస్పెండ్ చేస్తామని కేసీఆర్ హెచ్చరిక

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ పై చర్చ, ఆమోదం లక్ష్యంగా సమావేశాలు జరుగనుండగా, తొలిరోజు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేయడంతో ప్రభుత్వం వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. గవర్నర్ ప్రసంగాన్ని ఏ మాత్రం అడ్డుకోవాలని చూసినా, వారిని ఈ సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా హెచ్చరించారు. నేడు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుండగా, ఆపై 12 గంటలకు జరిగే బీఏసీ సమావేశంలో సభా కార్యకలాపాల నిర్వహణ, ఎన్ని రోజుల పాటు సభను జరపాలన్న అంశాలను చర్చించనున్నారు. ఇక ఇటీవలి తమ బస్సు యాత్ర ద్వారా తెలియవచ్చిన ప్రజా సమస్యలను సభలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుండగా, విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు విమర్శలు, ప్రతి విమర్శల మధ్య వాడివేడిగా జరుగుతాయనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News