Election Commission (EC): ఈసీ కీలక నిర్ణయం...ఓటరు కార్డులకూ ఆధార్ లింకు తప్పనిసరి...!

  • ఆధార్-ఓటరు కార్డు లింకింగ్ కోసం సుప్రీంలో ఈసీ రివైజ్డ్ పిటిషన్
  • ఒక్క వ్యక్తి ఒక్క ఓటు మాత్రమే పొందేలా చేయడానికి వీలు
  • ఇప్పటివరకు 32 కోట్ల ఆధార్ నెంబర్లను ఓటరు కార్డులతో లింకు

అవకతవకలకు చెక్ పెట్టే దిశగా ఓటరు ఐడీ కార్డులతో ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టులో సవరీకృత పిటిషన్‌ (రివైజ్డ్ పిటిషన్)ను దాఖలు చేసినట్లు తెలిసింది. ఓటరు కార్డు-ఆధార్ అనుసంధానం వల్ల ఒక్క వ్యక్తి ఒక్క ఓటును మాత్రమే పొందేలా చేయవచ్చని ఈసీ భావిస్తున్నట్లు 'సండే ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక తెలిపింది. కాగా, అంతకుముందు 12 అంకెల ఆధార్ నెంబరును ఓటరు కార్డులకు అనుసంధానం చేయడం స్వచ్ఛందమేనని ఈసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ, 2016లో ఏకే జ్యోతి ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈసీ తన వైఖరిని మార్చుకుంది.

ఇప్పటివరకు 32 కోట్ల మంది ఆధార్‌ నెంబర్లను ఓటరు ఐడీ కార్డులతో అనుసంధానం చేశామని ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి ఓపీ రావత్ తెలిపారు. "ఇప్పటివరకు 32 కోట్ల ఆధార్ నెంబర్లు ఓటర్ల ఐడీ కార్డులతో అనుసంధానం చేశాం. మరో 54.5 కోట్ల నెంబర్ల అనుసంధానాన్ని సుప్రీంకోర్టు తీర్పు రాగానే పూర్తి చేస్తాం" అని బెంగళూరులో నిన్న జరిగిన 14వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)లో పాల్గొన్న సందర్భంగా రావత్ చెప్పారు. ఓటరు కార్డులతో తప్పనిసరిగా ఆధార్ నెంబరును అనుసంధానం చేయాలని ఈసీ చెబుతున్నప్పటికీ, ఆధార్ కార్డును ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డుగా మాత్రం పరిగణించేందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది. కాగా, ఆధార్‌కున్న రాజ్యాంగబద్ధమైన చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానంపై కోర్టు ఇచ్చే తుది తీర్పు కీలకం కానుంది.

  • Loading...

More Telugu News