BJP: ఇరకాటంలో ఏపీ బీజేపీ నేతలు.. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడాలా? ఏపీ ప్రయోజనాలకు విలువ ఇవ్వాలా?.. ఎటూ తేల్చుకోలేకపోతున్న వైనం!

  • దయనీయంగా బీజేపీ నేతల పరిస్థితి
  • నేడు విజయవాడలో కోర్ కమిటీ భేటీ
  • ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దానిపై చర్చ
  • అధిష్ఠానం వైఖరిని సమర్థించుకోలేకపోతున్న నేతలు

ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేతల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. రాష్ట్రం మొత్తం ఒకవైపు ఉంటే వారు మాత్రం మరోవైపు ఉంటూ ప్రజాగ్రహానికి గురవుతున్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిగా ప్రతిపక్షాలు సహా మేధావులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తుంటే.. తాము మాత్రం ఏపీకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశామని చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, హామీలను నెరవేర్చాలని చెబుతుండడంతో బీజేపీ నేతలకు ఏం మాట్లాడాలో పాలుపోవడం లేదు. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన చిత్ర పరిశ్రమ కూడా ఏపీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతోంది. బహిరంగ విమర్శలు చేస్తూ కేంద్రం తీరును తప్పుపడుతున్నారు. తాజాగా దర్శకుడు కొరటాల శివ చేసిన ‘మోదీని ‘మనిషి’గా మారుద్దాం’ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది.

ఇలా అన్ని వర్గాల నుంచి బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఏపీకి చాలా ఇచ్చాం అని బీజేపీ నేతలు చెబుతున్నా వారి వాదన నిలబడడం లేదు. చట్టంలో పెట్టినవి, ఇస్తామని హామీ ఇచ్చిన వాటినే అడుగుతున్నామని టీడీపీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు రూపాయి ప్రయోజనం కూడా కలగలేదన్న టీడీపీ వాదన ప్రజల్లో కి బలంగా వెళ్లిపోయింది. ఈ విషయం వారికి కూడా తెలుసు కాబట్టే రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చాం అని చెప్పడానికే పరిమితమవుతున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ఇతర హామీల గురించి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు.

అందరూ ఒకేసారి బీజేపీని దుమ్మెత్తి పోస్తుండడంతో ఏపీ బీజేపీ నేతల పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్కలా’ తయారైంది. నిన్నమొన్నటి వరకు టీడీపీపై దుమ్మెత్తి పోసిన వారే నేడు తమ వాదనను సమర్థించుకోలేక అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధిష్ఠానం వైఖరిని సమర్థించుకోలేక సతమతమవుతున్నారు.

ఈనెల 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి సానుకూల ప్రకటన వెలువడుతుందని అందరూ భావించగా.. గతంలో చెప్పిన దానినే మళ్లీ చెప్పడంతో బీజేపీ నేతలకు మింగుడుపడలేదు. అదే రోజు బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు టీడీపీ ప్రభుత్వాన్ని, చంద్రబాబును ప్రశంసించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు కూడా ఏపీ కోసం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని ప్రశంసించారు. ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో పార్టీ సిద్ధాంతానికి, రాష్ట్ర ప్రయోజనాలకు మధ్య బీజేపీ నేతలు నలిగిపోతున్నట్టు అర్థమవుతోంది.


ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకతను అధిగమించి వారికి చేరువయ్యేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలంటూ బీజేపీ అధిష్ఠానం నుంచి కబురు అందినట్టు తెలుస్తోంది. దీంతో, నేడు విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సతీశ్‌జీ, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, పురందేశ్వరి, సోము వీర్రాజు, రవీంద్రరాజు, ఇతర సభ్యులు ఇందులో పాల్గొననున్నారు.  

  • Loading...

More Telugu News