BJP: ఓ వైపు బీజేపీతో కలుస్తామంటున్నారు.. మరోవైపు అవిశ్వాసం పెడతామంటున్నారు: ఏపీ మంత్రి యనమల

  • కేసులు మాఫీ చేయించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు
  • వైసీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు
  • రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారు
  • ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసిన తరువాత కేంద్రం ఎటువంటి హామీ నెరవేర్చలేదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్ ఓ వైపు బీజేపీతో కలుస్తామంటున్నారని, మరోవైపు అవిశ్వాసం పెడతామంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టయినా సరే కేసులు మాఫీ చేయించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని, జైల్లో ఉండి వచ్చారని, ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరవుతారని యనమల విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తూ కేంద్ర మంత్రి పదవులకి రాజీనామా చేశారని, తాము రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చుకోవాలనే దృక్పథంతో ఉంటే, వైసీపీ అధినేత మాత్రం తనపై ఉన్న కేసులు మాఫీ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారని ఆరోపించారు.వైసీపీ పార్లమెంటులోనూ డ్రామాలాడుతోందని విమర్శించారు.

వైసీపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో గుణ పాఠం చెబుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తిగా నిధులు ఇవ్వలేదని తాము అనట్లేదని, కొంత ఇచ్చారని.. అలాగే, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని అన్నారు. స్పెషల్ ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పినప్పటికీ దాన్ని అమలు చేయలేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను అరుణ్ జైట్లీతో చెప్పానని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసిన తరువాత ఎటువంటి హామీ నెరవేర్చలేదని చెప్పారు. 

  • Loading...

More Telugu News