Chandrababu: చంద్రబాబు చేసిన ట్వీట్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా

  • మహిళా సాధికారతకు తమ ఇల్లే ఉదాహరణని చంద్రబాబు అన్నారు
  • సేవా రంగంలో చంద్రబాబు 24 గంటలు బిజీగా ఉంటారట
  • వ్యాపారాన్ని తన భార్య, కోడలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారట
  • మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దుతానని చెప్పి, ఇద్దరిని మాత్రమే తీర్చిదిద్దారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకి అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆడపిల్లలందరికీ సెల్ ఫోన్లు కొనిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడి మానిఫెస్టో ఒకసారి అందరూ చూడాలని, చదువుకునే ఆడపిల్లలకి ఐప్యాడ్లు ఇస్తామని, అవి వారి చదువుకు ఉపయోగపడతాయని అన్నారని తెలిపారు.

అంతేగాక, మహిళలకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారని రోజా చెప్పారు. ఇటువంటి మాటలు కేవలం ఓట్ల కోసం మహిళలను మోసం చేయడానికే చెప్పారని అన్నారు. ఏపీ బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని, మహిళలకు బడ్జెట్లో ప్రవేశపెట్టింది శూన్యమని చెప్పారు. మహిళలకు అన్యాయం చేయడమే కాకుండా మహిళా దినోత్సవం నాడు చంద్రబాబు ఓ ట్వీట్ చేశారని అన్నారు. అది పుండు మీద కారం చల్లినట్లు ఉందని చెప్పారు.

'మహిళా సాధికారతకు మా ఇల్లే ఉదాహరణ.. సేవా రంగంలో 24 గంటలు నేను బిజీగా ఉంటాను.. వ్యాపారాన్ని నా భార్య సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఇప్పుడు మా కోడలు కూడా వ్యాపార బాధ్యతలు చూసుకుంటోంది. నేను మా అబ్బాయి ఆర్థికంగా వారి మీద ఆధారపడుతున్నామంటే అర్థం చేసుకోండి వారి సమర్థత'.. అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారని రోజా అన్నారు. 'ఎంత చౌకబారుగా ఉంది ఈ ట్వీటు.. చంద్రబాబు నాయుడు తాను బాగుంటే రాష్ట్రం అంతా బాగుందని అనుకుంటున్నారు. ఈ రోజు తన కొడుకుకి మంత్రి ఉద్యోగం ఇచ్చేసి రాష్ట్ర యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేశాయనుకుంటున్నారు.

వారింట్లో సాధికారత వచ్చేసింది కాబట్టి రాష్ట్రం అంతా సాధికారత వచ్చేసిందనడానికి సిగ్గు పడాలి. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను పారిశ్రామికంగా ఎదిగేలా చేస్తామని, వ్యాపారస్తులుగా చేస్తామని చెప్పిన చంద్రబాబు.. నేడు తన ఇంట్లోని ఇద్దరు మహిళలను బినామీ డబ్బుతో పారిశ్రామికంగా ఎదిగేలా చేశారు' అని రోజా ఆరోపణలు చేశారు. ఇది మహిళా సాధికారతా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News