mohammad basheer: అప్పటి వరకు ధోనీ గురించి పెద్దగా తెలీదు..ఇప్పుడు నా భార్య కంటే ధోనీయే ఇష్టం: చాచా చికాగో
- భారత్ ఆడే మ్యాచ్ లలో సందడి చేసే పాకిస్థానీ
- 2011 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ వరకు ధోనీ అంటే పెద్దగా తెలీదు
- అప్పటి నుంచి ధోనీకి అభిమానినైపోయాను
నా భార్య కంటే కూడా ధోనీ అంటే నాకు ఇష్టమని టీమిండియా వీరాభిమాని, పాకిస్థాన్ జాతీయుడైన మొహమ్మద్ బషీర్ అలియాస్ చాచా చికాగో చెబుతున్నారు. శ్రీలంకలో భారత్ ఆడుతున్న మ్యాచ్ లలో స్టేడియంలో కూర్చుని పాక్ దుస్తులతో భారత్ జెండా పట్టుకుని జట్టును ఉత్సాహపరుస్తున్న బషీర్ ను మీడియా సంప్రదించగా, తాను అమెరికాలోని షికాగోలో స్థిరపడ్డానని, తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం మని చెప్పాడు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇంకా ఇష్టమని అన్నాడు. ధోనీ అంటే ఇంకా ఇష్టమని, ధోనీని ఇష్టపడేందుకు కారణం వెల్లడించాడు.
2011 వరల్డ్ కప్ లో భారత్-పాక్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు మొహాలీ చేరుకున్నానన్నాడు. తాను వచ్చేసరికి మైదానంలో టికెట్లన్నీ అమ్ముడైపోయాయన్న బోర్డులు కనిపించాయని చెప్పాడు. దీంతో ఎలాగైనా మ్యాచ్ చూడాలని ఒక్క టికెట్ కావాలంటూ తీవ్రంగా ప్రయత్నించానని అన్నాడు. అయినా ఫలితం లేకపోవడంతో మైదానం బయట ‘నేను మ్యాచ్ను చూడాలనుకుంటున్నాను’ అని ఒక ప్లకార్డుపై రాసి, దానిని పట్టుకుని దిగాలుగా కూర్చున్నానని తెలిపాడు. రెండో రోజు కూడా మైదానం బయట అలాగే ఉండడంతో ఒక వ్యక్తి వచ్చి, తన చేతికి ఒక కవర్ ఇచ్చి, దానిని ధోనీ పంపాడని తెలిపాడన్నాడు.
అప్పటికి తనకు ధోనీ గురించి ఏమీ తెలియదని బషీర్ తెలిపాడు. ఆ కవర్ లో టికెట్లున్నాయని, ఆ రోజు నుంచి తాను ధోనీ ఫ్యాన్ ను అయిపోయానన్నాడు. తన భార్య కంటే కూడా తనకు ధోనీ అంటే ఇష్టమని పేర్కొన్నాడు. తనను చాలా మంది టీమిండియాకు ఎందుకు సపోర్ట్ చేస్తావు? అని ప్రశ్నిస్తుంటారని బషీర్ తెలిపాడు. వారందరికీ ‘ఇండియాలో కావాల్సినంత ప్రేమ దొరకుతుంది. మనదేశంలోని పెద్దవారు యువతలో భారత్ శత్రుదేశమనే బీజాలు నాటారని, కానీ అవి అవాస్తవమ'ని చెబుతుంటానని బషీర్ తెలిపాడు. ప్రస్తుతం బషీర్ శ్రీలంకలో భారత్ ఆడే మ్యాచ్ లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒళ్లంతా పెయింట్ లు పూసుకుని, చేతిలో జాతీయ జెండా పట్టుకుని జట్టును ఉత్సాహపరిచే సుధీర్ తో పాటు బషీర్ పలు సందర్భాల్లో కనిపిస్తుంటారు.