R.Narayana Murthy: సినిమాలు బంద్ చేసి ఏం సాధించారు?.. తెలుగు ఫిలిం చాంబర్‌పై విరుచుకుపడిన నటుడు ఆర్.నారాయణమూర్తి

  • కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌లో బంద్ కొనసాగుతోంది
  • ఇక్కడ మాత్రం హఠాత్తుగా బంద్ విరమించారు
  • కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా చేస్తారా?
  • కడిగి పారేసిన ‘ఎర్ర’ నటుడు

తెలుగు ఫిలిం చాంబర్‌పై ఎర్ర సినిమాల నటుడు ఆర్.నారాయణమూర్తి విరుచుకుపడ్డారు. డిజిటల్ సర్వీస్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల చేపట్టిన బంద్ ద్వారా ఏం సాధించారని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. దాదాపు వారం పాటు కొనసాగిన బంద్‌ను శుక్రవారం విరమించారు. శుక్రవారం తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, ఆర్.నారాయణమూర్తి కలిసి ఫిలిం చాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. తమిళనాడు, కర్ణాటక, కేరళలో బంద్ కొనసాగుతుంటే ఇక్కడ మాత్రం ఎందుకు విరమించారని ప్రశ్నించారు. హామీలు అమలు కాకుండా బంద్‌ను ఎలా విరమిస్తారని నిలదీశారు. బంద్ వల్ల సినీ కార్మికులు ఇబ్బంది పడడం వల్ల ఒరిగిందేమీ లేదని విమర్శించారు. నిర్మాతలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ సహకరించారని, ప్రేక్షకులు కూడా మద్దతు ఇచ్చారని నారాయణమూర్తి అన్నారు. అయితే కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం బంద్‌ను ఉన్నపళంగా విరమించుకోవడం సరికాదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్ వల్ల సాధించినదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సురేశ్ బాబు, జెమినీ కిరణ్, అల్లు అరవింద్ వంటి పెద్దలు ఈ సమస్యను ముందే పరిష్కరించి ఉంటే సరిపోయేదని అన్నారు.

రామానాయుడు, దాసరి నారాయణరావులు ఎప్పుడూ నిర్మాతల మంచి కోరేవారే కానీ, ఎప్పుడూ స్వార్థ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదన్నారు. డిజిటల్ సర్వీస్‌లు అందిస్తామని కొత్తవారు వస్తున్నా, వారిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారికే కనుక అవకాశం ఇస్తే క్యూబ్, యూఎఫ్ఓ వంటి వాళ్లు తప్పకుండా దిగి వస్తారని పేర్కొన్న నారాయణమూర్తి, ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఉచితంగా ఇచ్చే వరకు థియేటర్స్ బంద్ ఆపేది లేదని చెప్పి ఇప్పుడు రూ.2 వేలు తగ్గించగానే ఆపేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News