BJP: తప్పు మా మీద నెట్టే ప్రయత్నం ఎందుకు?: చంద్రబాబుకు పురందేశ్వరి సూటి ప్రశ్న
- ఓ పథకం ప్రకారం తప్పును బీజేపీవైపు నెడుతున్నారు
- ఏపీకి న్యాయం చేసేందుకు కట్టుబడే ఉన్నాం
- ప్యాకేజీ నిధులను ఎలా ఖర్చుపెట్టారని అడగడం తప్పా?
- మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, కేంద్ర మంత్రి పదవులకు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసిన విషయమై బీజేపీ మహిళా నేత పురందేశ్వరి స్పందించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, ఓ పథకం ప్రకారం తప్పును బీజేపీవైపు నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జైట్లీ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పిన ఆమె, రాష్ట్రానికి విభజన హామీల అమలుకు పది సంవత్సరాల సమయం ఉందని అన్నారు.
పదేళ్లపాటు హైదరాబాద్ లోనే ఉంటూ అన్నీ చక్కదిద్దుకునే అవకాశాన్ని వదిలేశారని గుర్తు చేసిన ఆమె, అయినప్పటికీ ఏపీకి న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి లాభం ఉండదని చంద్రబాబునాయుడు స్వయంగా అంగీకరించారని, ప్యాకేజీలో భాగంగా డబ్బు తీసుకుని ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పాలని అడిగితే, ఆ విషయం చెప్పకుండా ఇప్పుడు హోదా కోసం గొడవ చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర విద్యా సంస్థలకు తక్కువ నిధులు ఇస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం వెనుక తెలుగుదేశం నేతల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగించాలని కేంద్రం భావించడం లేదని పురందేశ్వరి అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి లాభమేనని ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు.