Jagan: జగన్ వైపు చూస్తున్న బీజేపీ... ఇక అన్ని కేసులూ పోతాయని ఢిల్లీలో ప్రచారం మొదలు!

  • ఏపీలో పొత్తు కోసం జగన్ వైపు చూస్తున్న బీజేపీ
  • ఈడీ ఇప్పటికే క్లీన్ చిట్ ఇవ్వడం మొదలు పెట్టినట్టు ప్రచారం
  • జగతి పబ్లికేషన్స్ లో ఇటీవల ఓ క్లీన్ చిట్
  • బీజేపీతో స్నేహం వల్లేనంటున్న విశ్లేషకులు!

తెలుగుదేశం పార్టీ ఇక తమతో ఉండబోదని అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు, ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైపు చూస్తున్నారా? ఢిల్లీలో మొదలైన కొత్త ప్రచారాన్ని గురించి వింటుంటే అది నిజమే అనిపిస్తోంది. బీజేపీకి, జగన్ కు మధ్య ఓ అవగాహన కుదిర్చేందుకు ప్రముఖ వ్యాపార సంస్థతో పాటు జాతీయ స్థాయిలో ప్రాబల్యమున్న కొన్ని రాజకీయ శక్తులు కూడా రంగంలోకి దిగాయని తెలుస్తోంది.

జగన్ తో తమకు ఎలాంటి సీక్రెట్ డీల్ లేదని, టీడీపీ వారు అనవసరంగా అపోహ పడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసినప్పటికీ, పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి, అమిత్, మోదీలతో పలుమార్లు సమావేశమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జగన్ పై పెట్టిన కేసుల్లో క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు, సీబీఐ చర్యల నిలుపుదల, జగన్ రాజకీయంగా ఎదిగేందుకు సహకరించడం వంటి ప్రయోజనాలను ఎన్డీయే సర్కారు అందిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇందుకు ఉదాహరణగా, జగతి పబ్లికేషన్స్ కు చెందిన రూ. 34.6 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్ల జప్తు విషయంలో ఈడీ అపిలేట్ అథారిటీ క్లీన్ చిట్ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ఏకే దండమూడి, టీఆర్ కన్నన్, మాధవ్ రామచంద్రన్ తదితరుల నుంచి మనీలాండరింగ్ కింద గతంలో సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేయగా, ఇందుకు క్విడ్ ప్రోకో లేదని కూడా క్లీన్ చిట్ లభించింది.

ఇదిలావుండగా, జగన్ పై ఉన్న కేసుల్లో వేగాన్ని తగ్గించాలని పై నుంచి తమకు ఆదేశాలు వస్తున్నాయని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఈడీ అధికారులు అంటున్నారు. నైతికంగా జగన్ కు సహకరించాలన్నదే బీజేపీ ఉద్దేశమని, ఆపై ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తే, తమకూ లాభమేనని బీజేపీ అంచనా వేస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News