manikyala rao: తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా చేశా.. చంద్రబాబు సమర్థతకు పోటీ లేదు: మాణిక్యాలరావు
- రాష్ట్ర ప్రజల కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి చేశారు
- ముంపు మండలాలను సాధించారు
- నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటా
రాష్ట్ర మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నానని మాణిక్యాలరావు అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు స్పందించారు. విశాఖను వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేశామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే... రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ముంపు మండలాలను ఏపీలో కలపడంలో ఆయన సఫలీకృతం అయ్యారని చెప్పారు. చంద్రబాబు సమర్థతకు పోటీలేదని అన్నారు.
దేవాదాయ శాఖ మంత్రిగా తన శాఖలో మార్పులు తీసుకొచ్చేందుకు పని చేశానని మాణిక్యాలరావు అన్నారు. తనకు సహకరించిన ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడే ఉంటానని చెప్పారు. తనకు మంత్రి పదవి రావడానికి కారణం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడేనని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆనాడు రాజ్యసభలో వెంకయ్య చేసిన పోరాటం చాలా గొప్పదని కొనియాడారు.