Arun Jaitly: నోట్ల కట్టలను దాచుకుంటున్న తెలుగు ప్రజలు... అరుణ్ జైట్లీ కీలక వ్యాఖ్య!
- చర్చనీయాంశమైన అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు
- ప్రజలు డబ్బు దాచుకోవడం వల్లే ఏటీఎంలలో నగదు కొరత
- ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగానే ఇచ్చామన్న జైట్లీ
తెలుగు రాష్ట్రాల ప్రజలను అవమానించేలా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడటం వెనుక ప్రజలు భారీ ఎత్తున కరెన్సీని ఇళ్లలో దాచుకున్నారని, అందువల్లే కొరత ఏర్పడిందన్న అర్థం వచ్చేట్లుగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నిన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వేళ, అక్కడికి వచ్చిన బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పుష్పలీల కల్పించుకుంటూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో డబ్బులు లేవని, దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వెంటనే అదనంగా డబ్బు పంపించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. వెంటనే స్పందించిన మంత్రి తాము ఇప్పటికే పంపించాల్సిన డబ్బు కన్నా చాలా అధికంగానే కరెన్సీ నోట్లను ఏపీ, టీఎస్ లకు పంపించానని చెప్పారు. ప్రజలు నోట్ల కట్టలను బ్యాంకు లాకర్లలోను, ఇళ్లల్లోను దాచుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు.