hari babu: పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయడం లేదని ప్రచారం చేయడం సరికాదు: బీజేపీ నేత కంభంపాటి హరిబాబు

  • చట్టంలో పొందుపర్చిన అంశాలతో పాటు పొందుపర్చని అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది  
  • తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు
  • కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మరు

ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేక హోదాకి బ‌దులు చేయాల్సిన సాయం చేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... రెవెన్యూ లోటుని భర్తీ చేయాలని చట్టంలో ఉందని అన్నారు. 2015-16 ఏడాదికిగానూ ఆర్థిక సంఘం సుమారు రూ.6600 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు వచ్చిందని అంచనా వేసిందని అన్నారు. రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తూనే ఉందని అన్నారు. చట్టంలో పొందుపర్చిన అంశాలతో పాటు పొందుపర్చని అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయడం లేదని ప్రచారం చేయడం సరికాదని అన్నారు.

కాగా, ప్రత్యేక హోదాకు బదులు ఆర్థిక సాయం చేస్తామని జైట్లీ ప్రకటించారని అన్నారు. విదేశాల నుంచి ఏపీ తేలికగా రుణాలు పొందడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని చెప్పారు. 14 వ ఆర్థిక సంఘం ప్రత్యక హోదా కాకుండా ప్రత్యేక సాయం ఇవ్వాలని సూచించిందని, ఆ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. ఏపీలో పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సాయం కోరితే తప్పకుండా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఆత్మగౌరవదీక్ష పేరుతో ఆందోళన చేస్తోందని హరిబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, తమ మొదటి నిర్ణయం అదే అవుతుందని రాహుల్ గాంధీ అంటున్నారని, హోదా ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆనాడు ఏపీ విభజన చట్టాన్ని రూపొందించినప్పుడు చట్టంలో ఆ అంశాన్ని ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు.

అధికారంలో ఉన్న సమయంలో సంతకం చేయకుండా, మళ్లీ అధికారం ఇవ్వండి, మళ్లీ వస్తే ఇస్తాం అనడంలో ఆంతర్యం ఏంటి? అని హరిబాబు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, ఆ పార్టీ నేతలు రాజకీయ లబ్ది కోసం మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు వారి మాటలు నమ్మరని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News