Congress: ఎన్నికలెప్పుడొచ్చినా ‘కాంగ్రెస్’దే గెలుపు: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
- రాహుల్ నిర్ణయం మేరకే ఎన్నికల పొత్తులు ఉంటాయి
- డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది
- థర్ఢ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్ డ్రామాలు : ఉత్తమ్
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీదే గెలుపని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే ఎన్నికల పొత్తులు ఉంటాయని అన్నారు. డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సరిగ్గా నెరవేర్చలేదని, రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. థర్ఢ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కారులో మూడు కోట్లు దొరికాయని తనపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ కేసును కోర్టు కొట్టేసిన విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు.