: ఆ ఎన్టీఆర్ తర్వాత మహేశ్ బాబే: వెంకయ్యనాయుడు
ఎప్పుడూ రాజకీయాలతో తలమునకలై ఉండే బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడి నోట సినీ పలుకులేల అని సందేహిస్తున్నారా? అయితే, నిన్న ఢిల్లీలో జరిగిన 'ఫ్రం ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకావిష్కరణ సభలో ఏం జరిగిందో ఓసారి పరికించాల్సిందే. 'ఫ్రం ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకంలో ఎన్టీఆర్ జీవిత విశేషాల ఫొటోలను పొందుపరిచారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అనంతరం ఏపీ భవన్ లో ఈ పుస్తకావిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు తన అభిప్రాయాలను పంచుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ ఎంతో అందంగా ఉండేవాడని పేర్కొన్న వెంకయ్య నాయుడు, ప్రస్తుతం మహేశ్ బాబు అందంగా కనిపిస్తున్నాడని కితాబిచ్చారు. ఇక శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ నవ్వితే తమ పార్టీ చిహ్నం కమలం విచ్చుకున్నట్టు ఉండేదని గుర్తు చేసుకున్నారు. భారత చలనచిత్ర చరిత్రలో ఎన్టీఆర్ అంతటి స్ఫురద్రూపి మరెవరూలేరని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.