shooting: మరో పసిడితో మెరిసిన మనూ బాకర్
- నిన్న మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న మను బాకర్
- నేడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో ఓం ప్రకాశ్ మితర్వాల్ తో కలిసి మరో స్వర్ణ పతకం
- 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకం గెలుచుకున్న మెహులి ఘోష్-దీపక్ కుమార్ జోడీ
సీనియర్ షూటింగ్ ప్రపంచకప్ లో భారత యువ సంచలనం మనూ బాకర్ మరో సంచలనం సృష్టించింది. సీనియర్ విభాగంలో తొలి ప్రపంచకప్ ఆడుతున్న 16 ఏళ్ల మను నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో రెండుసార్లు ప్రపంచకప్ స్వర్ణ పతక విజేత అలెగ్జాండ్రా జవాలాను వెనక్కినెట్టి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఫైనల్ ఈవెంట్ లో మరో భారత షూటర్ ఓం ప్రకాశ్ మితర్వాల్ తో కలిసి మను బాకర్ మరో స్వర్ణపతకం గెలుచుకుంది. దీంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. టీమ్ ఈవెంట్ లో మను బాకర్, ఓం ప్రకాశ్ మితర్వాల్ జోడీ 476.1 పాయింట్లతో స్వర్ణం సాధించగా, జర్మనీ షూటర్లు 475.2 పాయింట్లతో రజత పతకాన్ని, ఫ్రాన్స్ షూటర్లు 415.1 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించారు. నాలుగో స్థానంలో మరో భారత జోడీ మహిమ తుర్హి అగర్వాల్-రిజ్వి 372.4 పాయింట్లతో నిలిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో భారత్ కు చెందిన మెహులి ఘోష్-దీపక్ కుమార్ జోడీ మూడో స్థానంలో నిలిచి, కాంస్య పతకం సొంతం చేసుకుంది.