nirmala sitaraman: నిర్మలా సీతారామన్ గారూ! అప్పుడెందుకు మాట్లాడలేదమ్మా?: తమ్మారెడ్డి భరద్వాజ
- కడుపుమంట మీద మోదీని కేసీఆర్ ఏదో అన్నారు
- మోదీని గౌరవించమని ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదు
- ఒక్క ప్రధానమంత్రిపై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తేనే మీరు స్పందిస్తారా?
- ఏపీకి ప్రత్యేక హోదా, దీపికాపదుకొణేను చంపేస్తామన్నప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? : తమ్మారెడ్డి విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకవచన ప్రయోగం చేయడాన్ని రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన’ ద్వారా స్పందించారు. ‘మోదీ గారి గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ప్రజలేమీ మాట్లాడలేదు. ప్రజలు కూడా కడుపు మండి ఉన్నారు.. రేపటి నుంచి ఏమైనా మాట్లాడితే మాట్లాడతారేమో! మీరు (బీజేపీ) ఏమైనా చేయొచ్చు కానీ, ఎదుటివాళ్లు ఏమనకూడదా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కడుపు మండి పోతోంది. ఆ కడుపుమంట మీద మోదీని కేసీఆర్ ఏదో అంటే..‘ఏకవచన ప్రయోగం చేస్తారా? బహువచన ప్రయోగం చేస్తారా?’ అని ఆమె ప్రశ్నిస్తున్నారు! ‘నేను టీ అమ్ముకుని వచ్చాను. ప్రజల్లో నేను కూడా ఒకడిని..ప్రజలతో ఉంటాను..’ అని చెప్పిన మోదీని గౌరవించమని ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదు. గౌరవించడమనేది ప్రతిపౌరుడి ధర్మం.
కడుపు మండినప్పుడు ఏదో మాట్లాడుతుంటారు! ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోతుంటే మీరు (నిర్మలా సీతారామన్) ఎందుకు అడగట్లేదు? మొన్న..మా సినిమా వాళ్ల పెళ్లాలు ఎవరితోనో లేచిపోతారని మీ (బీజేపీ)ఎంపీ అన్న రోజున మీరు (నిర్మలా సీతారామన్) ఏం చేశారు? అదేమీ తప్పు కాదా? ఒక్క ప్రధానమంత్రిపై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే మీరొచ్చేసి మీడియా ముందు మాట్లాడతాననడం కరెక్టు కాదు.
‘పద్మావత్’ సినిమా వ్యవహారంలో నటి దీపికాపదుకొనేను చంపేస్తామని, ఆమె ముక్కు కోసెయ్యమని, డైరెక్టర్ ని చంపెయ్యమని, ఆయన తల నరికిచ్చిన వారికి రూ.5 కోట్లు ఇస్తామని మీ (బీజేపీ) ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్నప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదమ్మా? అప్పుడు గుర్తు రాలేదా? ఒక్క మోదీ గారిని ఎవరైనా అన్నప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయా మీకు (నిర్మలా సీతారామన్) ? మీరు అన్నీ తెలిసినవాళ్లు..ప్రతిదీ మాట్లాడితే బాగుంటుంది. ఒక్క దానికి మాత్రమే పరిమితమవడం బాగుండలేదు. నాకు నచ్చ లేదు. నాకు అనిపించింది మీకు (నిర్మలా సీతారామన్) చెప్పాను. ఈ మాటలు మీ దాకా చేరితే సంతోషం..వినండి’ అని తమ్మారెడ్డి కోరారు.