Rajini kanth: తమిళనాడులో రజనీ పోస్టర్ల వివాదం
- చెన్నైలో పలుచోట్ల ఎంజీఆర్-రజనీ ప్లెక్సీలు
- ఎంజీఆర్ విగ్రహావిష్కరణకు రజనీ రాక నేపథ్యంలోనే
- భారీ ప్లెక్సీల ఏర్పాటు మద్రాసు హైకోర్టు ఆదేశాలకు విరుద్ధం
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరో స్టార్ కమల్ హాసన్ మక్కళ్ నీది మయ్యమ్ పార్టీ ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక రజనీదే ఆలస్యం. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా రావాలన్నదే తలైవర్ ఆలోచన కావొచ్చు. తాజాగా చెన్నై నగరంలో పలుచోట్ల ఎంజీఆర్-రజనీకాంత్ భారీ ప్లెక్సీలు, హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. దివంగత ఎంజీఆర్ ఒకప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి.
నగరంలో ఆయన విగ్రహాన్ని రజనీకాంత్ ఆవిష్కరించనున్న నేపథ్యంలో వారిద్దరితో కూడిన భారీ ప్లెక్సీలను పలు చోట్ల అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే నిరాడంబరంగా ఉండే రజనీ ఇలాంటి ఆడంబర సంప్రదాయాలకు మద్దతిస్తారా?లేదా? అనేది తెలియడం లేదు. మరోవైపు భారీ ప్లెక్సీల ఏర్పాటు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలాంటి వాటి వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందిని కలిగిస్తుందని కోర్టు ఇదివరకే పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంజీఆర్-రజనీ పోస్టర్లు వివాదాస్పదంగా మారాయి. కాగా, ఎంజీఆర్... తమిళ సినిమాలతో పాటు రాజకీయాలను కూడా శాసించిన నటుడు-రాజకీయ నాయకుడు.