shooting: ప్రపంచ కప్ లో స్వర్ణంతో మెరిసిన 16 ఏళ్ల మనూ
- ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన మెక్సికో
- మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న మనూ భకర్
- హర్యాణాకు చెందిన మనూ భకర్
మెక్సికోలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ సీనియర్ షూటింగ్ ప్రపంచకప్ పోటీల్లో మనూ భకర్ (16) స్వర్ణంతో సత్తా చాటింది. హర్యాణాకు చెందిన మనూ భకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 237.5 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచింది. గత ఏడాది ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో 49 వ స్థానంలో నిలిచిన మనూ, గతంలో రెండు సార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన మెక్సికన్ క్రీడాకారిణి అలెజంద్ర జవాల (237.1) ను వెనక్కి నెట్టి ఈ ఏడాది స్వర్ణం కైవసం చేసుకుంది.
తరువాతి స్థానంలో ఫ్రాన్స్‌కు చెందిన సీలైన్ గోబర్ విల్లే(217) నిలిచింది. 196.1 పాయింట్లతో నాలుగో స్థానంలో మరో భారత క్రీడాకారిణి యశశ్విని సింగ్ నిలవడం విశేషం. ఈ ప్రపంచకప్ పోటీల్లో ఇప్పటి వరకు భారత్ 5 పతకాలు సొంతం చేసుకోగా, వాటిల్లో రెండు స్వర్ణాలు, మూడు కాంస్యాలు ఉండడం విశేషం. స్వర్ణంతో సత్తాచాటిన మనూ మాట్లాడుతూ, గోల్డ్ మెడల్ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. తొలి వరల్డ్ కప్ పోటీల్లోనే స్వర్ణం సాధించడం సంతోషంగా ఉందని, నిలకడగా ఇలాంటి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నానని తెలిపింది.