kcr: మీ దీవెన ఉంటే భారత రాజకీయాలకు అద్భుతమైన దిశా నిర్దేశం చేస్తా : సీఎం కేసీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి
- రైతుల గురించి ఆలోచించే పరిస్థితి దేశంలో లేదు
- పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చినప్పుడు రైతులకు పెట్టబడి ఎందుకు ఇవ్వరు? : కేసీఆర్
తెలంగాణ ప్రజల దీవెన ఉంటే వంద శాతం భారత రాజకీయాలకు అద్భుతమైన దశా దిశా చూపించి, ఈ దేశ ప్రజానీకానికి మార్గ నిర్దేశనం చేస్తానని సీఎం కేసీఆర్ భావోద్వేగంతో అన్నారు. హైదరాబాద్ ప్రగతిభవన్ లో ఆయన మాట్లాడుతూ, అటువంటి పని ఈ దేశానికి జరగాలి, లేకపోతే, ఈ దేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
‘నేను ఏదో ఆషామాషీగా, అవగాహన లేకుండా ఈ మాట చెప్పటం లేదు. నిజమైన ఫెడరల్ వ్యవస్థ ఆవిర్భవించాలి. రాష్ట్రాలకు అధికారాల బదలాయింపు జరగాలి. కేంద్రం గుప్పిట్లో సంపూర్ణ అధికారాలు ఉండాలన్నది భవిష్యత్తులో ఇకపై సాధ్యం కాదు. దేశ రాజకీయాల్లో మార్పు తెలంగాణ నుంచే ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా అందరినీ కూడగట్టుకుని ముందడుగు వేస్తాం. త్వరలోనే భావ సారూప్య పార్టీలు, వ్యక్తులను కలుపుకుని చర్చలు జరుపుతాం.
2004 నుంచి నేను ఢిల్లీకి వెళ్లిన తర్వాత అనేక మందితో మాట్లాడాను. అనేక అనుభవాలు పంచుకున్నాను. 12 పంచవర్ష ప్రణాళికలు అమలైతే..వాటన్నింటినీ నేను చదివాను. ఈ దేశం ముందుకెళా వెళ్లిందనే విషయాలను అవగాహన చేసుకున్నాను. ఆ రోజుల్లో నేను ఇందిరాగాంధీకి వీరాభిమానిని. భూ సంస్కరణల చట్టం తెచ్చి, పేదలకు గుడిసెలు వేయించి, కొన్ని పథకాలు తెస్తే.. ఆమె గొప్పనాయకురాలని నేను ఎంతగానో పొంగిపోయేవాడిని. ఈ సంతోషాన్ని స్నేహితులతో పంచుకునేవాడిని.
అయితే, ఈ కార్యక్రమాలు అంతగొప్పగా జరగలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. మోదీ గారితో నేను చాలాసార్లు చెప్పాను. దళితులకు, గిరిజనులకు, రైతులకు సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయనతో చాలాసార్లు మాట్లాడాను. రైతుల గురించి ఆలోచించే పరిస్థితి దేశంలో లేదు, ఆ పరిస్థితి మారాలి. ఇప్పటిదాకా, అన్నం పెట్టే రైతులకు ఎవరు సాయం చేశారు? వ్యవసాయం, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతుంటే కనీసం పట్టించుకునే నాథుడు లేడు, పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చినప్పుడు రైతులకు పెట్టుబడి ఎందుకు ఇవ్వరు? విప్లవాత్మకమైన ధోరణితో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యం’ అని కేసీఆర్ అన్నారు.