Woman: మహిళ పిత్తాశయంలో 99 రాళ్లు....తొలగించిన వైద్యులు
- భరించలేని కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిక
- స్కానింగ్‌లో బయటపడిన అసలు విషయం
- పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తింపు
- రెండున్నర గంటల పాటు ఆపరేషన్ చేసి తొలగింపు
భరించలేని కడుపునొప్పితో బాధపడుతున్న ఓ 45 ఏళ్ల మహిళ పిత్తాశయం నుంచి 99 రాళ్లను వైద్యులు తొలగించారు. కర్ణాటకలోని తుముకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. వివరాల్లోకెళితే...భరించలేని కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన సదరు మహిళకు స్కానింగ్ తీశారు. స్కానింగ్ రిపోర్టులో ఆమె పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వాటితో పాటు పొత్తికడుపు గోడ ముందు భాగంలో వాపు(అంబిలికల్ హెర్నియా)ను కూడా వారు గుర్తించారు. హెర్నియా, పిత్తాశయంలో రాళ్లు, మధుమేహం, బీపీ, స్థూలకాయం, గుండెసంబంధమైన రోగం కూడా ఆమెకు ఉన్నట్లు ఆసుపత్రిలోని సీనియర్ సర్జన్ డాక్టర్ వసీం ఇమ్రాన్ తెలిపారు.
చికిత్స కోసం ఆమె ఎన్నో చోట్లకు వెళ్లిందని, కానీ పేదరికం వల్ల ఆమెకు ఎవరూ సాయం చేయలేదని ఆయన చెప్పారు. ఆమె భర్త దినసరి కూలీ కావడం వల్ల బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేయించడానికి స్తోమత లేకపోయింది. ఎట్టకేలకు తుముకూరు ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ జరిగింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. పిత్తాశయంలోని 99 రాళ్లను వైద్యులు తీసివేశారు. వాటిలో మూడు రాళ్లు 12 మిల్లీ మీటర్ల పరిమాణంలోనూ మిగిలినవి నాలుగు నుంచి ఐదు మిల్లీమీటర్ల సైజులోనూ ఉన్నాయని వైద్యులు తెలిపారు.