P Chidambaram: కార్తీ చిదంబరాన్ని ముంబై విమానం ఎక్కించిన సీబీఐ!
- గత వారంలో అరెస్టయిన కార్తీ
- ముంబైకి తీసుకెళ్లి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ
- విచారిస్తున్న సీబీఐ, ఈడీ అధికారులు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని విచారిస్తున్న సీబీఐ అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను ముంబై తరలించారు. ఐఎన్ఎక్స్ మీడియాలో రూ. 300 కోట్ల విదేశీ పెట్టుబడులకు అనుమతి కోసం తాను, పీటర్ ముఖర్జియా కలసి అప్పటి ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిశామని, తన కుమారుడి కంపెనీకి సహకరించాలని ఆయన కోరాడని ఇంద్రాణి ముఖర్జియా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలో అంగీకరించిన నేపథ్యంలోనే కార్తీని ముంబై తరలించినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం మూతపడ్డ ఐఎన్ఎక్స్ మీడియా కార్యాలయానికి కార్తీని తీసుకెళ్లి విచారించనున్నామని, ఈడీ అధికారులు కూడా ఈ విచారణకు హాజరవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, తన కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, అందువల్లే తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చిదంబరం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరాన్ని సైతం ప్రశ్నించేందుకు సీబీఐ నోటీసులను సిద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి.