Meghalaya: మేఘాలయలో మేము చేయగలిగిందేమీ లేదన్న బీజేపీ... ఆర్థరాత్రి గవర్నర్ కు కాంగ్రెస్ ఫోన్!
- మేఘాలయాలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్
- కేవలం 2 సీట్లకే పరిమితమైన బీజేపీ
- చిన్నపార్టీల మద్దతును ఎన్పీపీ కూడగట్టుకోవాలి
- బీజేపీ వ్యూహకర్త హేమంత బిశ్వా
మేఘాలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి 10 మంది మద్దతు అవసరమైనంత దూరంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా, ఆ రాష్ట్రంలో తాము చేయగలిగింది ఏమీ లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈశాన్య భారతాన బీజేపీ వ్యూహకర్తగా వ్యవహరించిన హేమంత బిశ్వా ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, కాంగ్రెస్ ను అధికారం నుంచి దూరం చేయాల్సిన బాధ్యత ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ)పై ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాము చేయగలిగింది ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తం 60 స్థానాలున్న మేఘాలయలో 59 సీట్లకు ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్ కు 21, లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడు కొన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీకి 19 సీట్లు లభించిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్న ఎన్పీపీ, ఈ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. బీజేపీ కేవలం 2 సీట్లకు పరిమితం కాగా, ఇతర చిన్న పార్టీలు యూడీపీ, పీడీఎఫ్, హెచ్ఎస్ పీడీపీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు 17 సీట్లు దక్కాయి. అధికారం కోసం వీరి మద్దతు కూడగట్టేందుకు కొన్రాడ్ ప్రయత్నించాలని బిశ్వా సలహా ఇచ్చారు.
ఇదిలావుండగా, అతి పెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని మేఘాలయ గవర్నర్ గంగా ప్రసాద్ కు కాంగ్రెస్ నేతలు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత కమల్ నాథ్ మీడియాకు వెల్లడించారు. చిన్న పార్టీలను కలుపుకునేందుకు నిన్న ఫలితాల వెల్లడి అనంతరం హుటాహుటిన షిల్లాంగ్ చేరుకున్న ఆయన, తమకు మెజారిటీకి సరిపడా బలం ఉందని వెల్లడించారు. ఇతర పార్టీలతో చర్చిస్తున్నామని, అవి తృప్తికరంగా సాగుతున్నాయని కమల్ నాథ్ తెలిపారు.