Non-Bailable Warrant: నీరవ్ మోదీకి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసిన ప్రత్యేక కోర్టు
- పీఎన్‌బీని రూ.12,700 కోట్ల మేర ముంచేసిన నీరవ్ మోదీ
- ఈడీ సమన్లు బేఖాతరు
- పీఎంఎల్ఏ కోర్టును ఆశ్రయించిన అధికారులు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)కి రూ.12 ,700 కోట్ల మేర ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్లు జారీ అయ్యాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఏర్పాటైన ముంబైలోని న్యాయస్థానం ఈ వారంట్లు జారీ చేసింది. తమ ఎదుట హాజరు కావాల్సిందిగా పంపించిన సమన్లకు నీరవ్ మోదీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది.
నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్లు జారీ చేయాల్సిందిగా గతనెల 27న ఈడీ కోర్టును ఆశ్రయించింది. బ్యాంకు కుంభకోణం కేసులో విచారణ కోసం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సమన్లు పంపినప్పటికీ వారు బేఖాతరు చేశారని కోర్టుకు తెలిపింది. ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది.