Australia: ఆస్ట్రేలియాలో గన్ ఆమ్నెస్టీ.. ప్రభుత్వానికి సుమారు 57,000 తుపాకులను అప్పగించిన ప్రజలు!
- ఆస్ట్రేలియాలో 2,50,000 లైసెన్స్ లేని తుపాకులు
- 1996 నుంచి తుపాకుల వినియోగంపై ఆస్ట్రేలియాలో కఠిన చట్టాలు
- గత మూడు నెలల కాలంలో 57,324 తుపాకులు, ఆయుధాలకు సంబంధించిన 2,432 విడి భాగాలు ప్రభుత్వానికి స్వాధీనం
గన్ ఆమ్నెస్టీలో భాగంగా 57,000 పై చిలుకు తుపాకులను ఆస్ట్రేలియన్లు ప్రభుత్వానికి అప్పగించారని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. గన్ ఆమ్నెస్టీ అంటే ప్రజలు స్వచ్ఛందంగా తుపాకులను ప్రభుత్వానికి అప్పగించాలి, అలా అప్పగించిన వారికి ఎలాంటి శిక్ష ఉండదు. ఆస్ట్రేలియాలో 1996 నుంచి కఠిన చట్టాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించిన మొదటి ఆమ్నెస్టీ పీరియడ్ కు విశేష స్పందన వచ్చింది. గత మూడు నెలల కాలంలో 57,324 తుపాకులు, ఆయుధాలకు సంబంధించిన 2,432 విడి భాగాలు ప్రభుత్వానికి స్వాధీనం చేశారని ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రపంచంలోకెల్లా కఠిన చట్టాలు ఆస్ట్రేలియాలోనే ఉన్నప్పటికీ, ఆ దేశంలో 2,50,000 లైసెన్స్ లేని తుపాకులున్నట్లు అంచనా. ఉగ్రవాద దాడుల్లో వీటినే ఎక్కువగా వాడుతున్నట్లు అక్కడి పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆమ్నెస్టీ పిరియడ్ ముగిసిన తరువాత ఆస్ట్రేలియాలో ఎవరైనా లైసెన్స్ లేని తుపాకులతో కనిపిస్తే అమల్లో ఉన్న చట్టం ప్రకారం 2,12,500 అమెరికన్ డాలర్ల జరిమానాతో పాటు 14 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.