Vijayawada: విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దండి : ఏపీ సీఎస్ ఆదేశాలు

  • విజయవాడను కొంతకాలం రాజధాని నగరంగా భావించి మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయాలి
  • వచ్చే నెల సమీక్ష నాటికి అన్ని పనుల్లో ప్రగతి కనిపించాలి
  • అధికారులతో సమీక్షించిన దినేష్ కుమార్

విజయవాడకు అన్ని హంగులు సమకూర్చి సుందర నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో ఈరోజు సాయంత్రం సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ (వీఎంసీ) అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, విజయవాడను కొంతకాలం రాజధాని నగరంగా భావించి మాస్టర్ ప్లాన్ రూపొందించుకొని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వచ్చే వర్షాకాలం నాటికి నగరంలో వరద నీరు నిలబడకుండా ఉండేందుకు కాలువలను ఆధునికీకరించాలని ఆదేశించారు. అదే విధంగా, మురుగు కాలువలు, రోడ్లు, ఫుట్ పాత్, త్రాగునీరు, చెత్త తరలింపు, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని, వచ్చే నెల సమీక్ష నాటికి అన్ని పనుల్లో ప్రగతి కనిపించాలని చెప్పారు.

 ప్లాస్టిక్ వేస్టేజీని రీసైక్లింగ్, రీ ప్రాసెసింగ్ చేయించాలని సీఎస్ సూచించారు. నీటి పారుదల కాలువల అభివృద్ధి పనులు, జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యూవల్ మిషన్ (ఎఎన్ఎన్ యుఆర్ఎం), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- అందరికీ ఇళ్లు (పీఎంఏవై-హెచ్ ఎఫ్ ఏ) పథకాల కింద గృహ నిర్మాణాలు, అమృత ప్రాజెక్టు, డంప్ యార్డ్, ప్లాస్టిక్ వేస్టేజీ, మెట్రో పనుల గురించి అధికారులు వివరించారు.

నాలుగు జోన్లుగా విభజనకు ప్రతిపాదన

నగర సుందరీకరణలో భాగంగా పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగు జోన్లుగా విభజించాలని విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ జె.నివాస్ ప్రతిపాదించారు. వీఎంసీ బడ్జెట్ ను కూడా వివరించారు. నగరం అభివృద్ధికి అదనపు నిధులు కావాలని కమిషనర్ కోరారు. జోనల్ అధికారుల నియామకం, 51 గ్రామాలు వీఎంసీలో విలీనం, పుష్కరాల పనులు, మోడల్ మున్సిపాలిటీలు తదితర అంశాలను చర్చించారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News