jayendar saraswathi: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహాసమాధి!
- శాస్త్రబద్ధంగా జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశ క్రతువు
- జయేంద్ర సరస్వతి పార్థివ దేహానికి అభిషేకం
- తమిళనాడు గవర్నర్, టీటీడీ ఈవో తదితర ప్రముఖుల హాజరు
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశ క్రతువు శాస్త్రబద్ధంగా ముగిసింది. పూర్వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర స్వామిని అధిష్టానం చేసిన చోటనే జయేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని బృందావన ప్రవేశం చేశారు. అంతకుముందు, జయేంద్ర సరస్వతి పార్థివ దేహాన్ని బృందావనం వద్దకు తరలించిన అనంతరం, ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు.
కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశ క్రతువును వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన డాలర్ శేషాద్రి, టీటీడీ మాజీ ఈవో కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
కాగా, నిన్న ఉదయం పరమపదించిన జయేంద్ర సరస్వతి మహాసమాధి కార్యక్రమం వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా సాగింది. ఈరోజు ఉదయం 8 గంటలకు మహాసమాధి ప్రక్రియ ప్రారంభించారు. బృందావన ప్రవేశంగా పిలిచే ఈ అంతిమ సంస్కారాల ప్రక్రియ అభిషేకంతో ప్రారంభించారు. కంచి కామ కోటి పీఠంలోని ప్రధాన హాల్ లోని అభిషేకం పీఠం వద్దకు జయేంద్ర సరస్వతి పార్థివ దేహాన్ని తీసుకువచ్చిన అనంతరం, పాలు, తేనె మొదలైన ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.