Sun: ఈ ఏడాది భానుడి ప్రకోపాన్ని చవిచూడాల్సిందే... హెచ్చరించిన వాతావరణ శాఖ
- రికార్డు స్థాయికి పెరగనున్న ఉష్ణోగ్రత
- ప్రజలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి
- ఉత్తరాదిన మరింత పెరగనున్న ఉష్ణోగ్రత
- తెలుగు రాష్ట్రాల్లో ఒక డిగ్రీ వరకూ పెరిగే సగటు వేడిమి
ఈ సంవత్సరం వేసవిలో భానుడి భగభగలు ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి చేరనున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడిస్తూ, ప్రజలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే దేశవ్యాప్తంగా కనీసం ఒక డిగ్రీ వరకూ వేడి పెరుగుతుందని పేర్కొంది.
ఇప్పటికే ఉత్తరాది ప్రాంతాలైన ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతతో పోలిస్తే 1.5 డిగ్రీల వరకూ వేడి పెరిగిందని, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2.3 డిగ్రీల అధిక వేడి నమోదవుతోందని అధికారులు తెలిపారు. దేశంలోని 52 శాతం ప్రాంతంలో ఈ సంవత్సరం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ముఖ్యంగా మార్చి నుంచి మే మధ్య ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుతుందని, ఈ సమయంలో ప్రమాదకరమైన వేడి గాలులు వీస్తాయని హెచ్చరించారు.
కాగా, వాతావరణ శాఖ అధికారుల అంచనా మేరకు ఈ సంవత్సరం ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, బీహార్, జార్ఖండ్ పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, మరాట్వాడా, విదర్భ, మధ్య మహారాష్ట్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో అధిక వేడిమి నమోదు కానుంది. ఇక తమిళనాడు, దక్షిణ కర్ణాటక, కేరళ, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నామమాత్రంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో గతంలో నమోదైన వేడిమితో పోలిస్తే ఒక డిగ్రీ వరకూ కోస్తాంధ్రలో 0.6 డిగ్రీల వరకూ వేడిమి పెరగనుంది. మిగతా ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే సున్నా నుంచి అర శాతం మేరకు మాత్రమే అధిక వేడిమి నమోదు కానుంది.