KTR: నిన్న మొన్నటి దాకా మనల్ని కాంగ్రెస్ నేతలు సావగొట్టారు.. ఆగమాగం చేశారు: మంత్రి కేటీఆర్
- అధికారంలో ఉన్నప్పుడు వారు ఏమీ చేయలేదు
- ఇప్పుడేమో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
- అప్పట్లో 'నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకి' అనేవారు
- ఇప్పుడు ప్రజలు సర్కారు దవాఖానాకే వెళుతున్నారు
గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారం అప్పజెప్పితే ఆ పార్టీ నేతలు ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి పనులూ పూర్తి చేయలేదని విమర్శించారు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ సూర్యపేట జిల్లాలోని మద్దిరాలలో నిర్వహించిన ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... "నిన్న మొన్నటి దాకా మనల్ని కాంగ్రెస్ నేతలు సావగొట్టారు.. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు.. తెలంగాణను ఆగమాగం చేశారు.
ఇప్పుడేమో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు ఏది చెబితే అది నమ్ముతారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.. ప్రజలు ఏం జరుగుతుందో గుర్తించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు అప్పట్లో ఫ్లోరైడ్ సమస్య గురించి పట్టించుకోలేదు. రైతులను అప్పుల ఊబి నుంచి కేసీఆర్ ప్రభుత్వం గట్టెక్కించింది. పేదింటి ఆడ కూతురు పెళ్లి చేసుకుంటే కల్యాణ లక్ష్మి పథకం కింద డబ్బు ఇస్తున్నాం.
అప్పట్లో 'నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకి' అనేవారు. ఇప్పుడు ప్రజలు సర్కారు దవాఖానాకే వెళుతున్నారు. మేము ఇంటింటికీ నీళ్లు ఇస్తాం.. ప్రతి పక్ష పార్టీలకు మూడు చెరువుల నీరు తాగిస్తాం. ఆనాడు కరెంటు కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ పాలనలో కరెంటు కష్టాలు లేవు" అని వ్యాఖ్యానించారు.