Sridevi: శ్రీదేవి పార్థివదేహం త్వరగా స్వదేశానికి చేరుకున్నది.. ఆ భారతీయుడి వల్లే!

  • పోలీసులు, అధికారులతో మాట్లాడి లాంఛనాలు వేగంగా పూర్తిచేసిన ఆశ్రఫ్
  • మెకానిక్ గా పనిచేస్తూ సేవా కార్యక్రమాలు
  • దుబాయిలో మరణించిన విదేశీయుల దేహాలను తిరిగి పంపేందుకు తోడ్పాటు
  • శ్రీదేవి ఘటనలో పేపర్ వర్క్ అంతా చూసుకున్నది ఆయనే..


కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించిన నటి శ్రీదేవి మరణించారన్న వార్త విని అభిమానులెవరూ తట్టుకోలేకపోయారు. ఆమెను కడసారి చూసుకోవాలని ఎదురుచూశారు. కానీ ఆమె మరణించింది దుబాయ్ లో. పార్థివ దేహాన్ని తిరిగి స్వదేశానికి పంపడానికి ఎన్నో నిబంధనలు, చట్టాలు. అలాంటి పరిస్థితిలో లాంఛనాలన్నీ వేగంగా జరిగేలా తోడ్పడి... శ్రీదేవి పార్థివ దేహం త్వరగా ముంబైకి చేరుకోవడానికి సహకరించినది అక్కడి ఓ భారతీయుడు. 44 ఏళ్ల వయసున్న ఓ మెకానిక్. అధికారిక పత్రాల్లో ఆయన పేరు ఆశ్రఫ్. పూర్తిపేరు ఆశ్రఫ్ షెర్రీ థమరాసెరీ. స్వస్థలం కేరళలోని థమరాసెరి.

ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయాలన్న మానవతా దృక్పథం నిండుగా ఉన్న మనిషి ఆశ్రఫ్. పొట్టకూటి కోసం దుబాయికి వలసవచ్చి.. సహజంగానో, ప్రమాదవశాత్తూనో ప్రాణాలు వదిలిన విదేశీయుల దేహాలను తిరిగి వారి స్వదేశాలకు పంపేందుకు తోడ్పడుతూ ఉంటారు. దీంతో దుబాయ్ లో ఎవరైనా విదేశీయులు మరణిస్తే.. అధికారులు, స్థానికులు ఆయనకు సమాచారం ఇస్తుంటారు.

నటి శ్రీదేవి మరణించిన రోజున కూడా ఆయనకు సమాచారం వచ్చింది. వెంటనే తన మెకానిక్ షాపు నుంచి శ్రీదేవి మరణించిన హోటల్ వద్దకు వచ్చారు. పోలీసులు, స్థానిక అధికారులతో మాట్లాడి.. లాంఛనాలన్నీ వేగంగా జరిగేలా చూశారు. మార్చురీ వద్ద, ఇతర అధికార కార్యాలయాల్లో ఏమేం వివరాలు ఇవ్వాలి, భౌతిక కాయాన్ని తిరిగి స్వదేశానికి తరలించేందుకు ఏం చేయాలన్న పేపర్ వర్క్ అంతా స్వయంగా చూసుకున్నారు. చివరిగా ఆస్పత్రి మార్చురీ నుంచి శ్రీదేవి పార్థివ దేహాన్ని అంబులెన్సులో విమానాశ్రయానికి పంపేవరకు అక్కడే ఉన్నారు.

శ్రీదేవి మృతి చెందినప్పటి నుంచి తనకు వందలాది మంది జర్నలిస్టులు, అధికారులు ఫోన్లు చేసి వివరాలు అడిగారని... భారతీయ అధికారులు ఫోన్ చేసి అవసరమైన వివరాలు అందజేశారని ఆశ్రఫ్ థమరాసెరీ చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న కొందరు తెలుగువారు తనతో మాట్లాడారని, శ్రీదేవి అంటే ఎంత అభిమానమో చెప్పారని వెల్లడించారు.

సేవాభావానికి ప్రతీకగా నిలిచిన ఆశ్రఫ్ ఇప్పటివరకు 38 దేశాలకు చెందిన 4,700 మంది దేహాలను స్వదేశాలకు తిరిగి పంపేందుకు అవసరమైన సహాయాన్ని అందజేశారు. అంతెందుకు నటి శ్రీదేవి మరణం నుంచి తిరిగి ముంబైకి పంపే మధ్య సమయంలోనే ఆయన మరో ముగ్గురికి సంబంధించి కూడా ‘రీపార్టియేట్ (మరణించిన వారి దేహాలను తిరిగి స్వదేశానికి పంపడం)’ ప్రక్రియకు సహకరించడం గమనార్హం. ఆశ్రఫ్ చేసిన సేవలకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా కూడా సత్కారం పొందారు.

‘‘విదేశాలకు వచ్చిన వారికి ఇక్కడ ఏదైనా అయితే.. ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలన్నది తెలియదు. వారి బంధువులు, తెలిసినవారు కూడా బాధలో ఉంటారు. అలాంటి వారికి తోడుగా నిలవాలన్నదే నా ఉద్దేశం..’’ అని ఆశ్రఫ్ తెలిపారు.

  • Loading...

More Telugu News