stive wagh: అందరూ తనలా ఆడాలనుకోవడం సరికాదు: కోహ్లీకి స్టీవ్ వా సూచన
- కోహ్లీలో దూకుడెక్కువ
- ఒక్కో ఆటగాడు ఒక్కోలా ఆడుతాడన్న వాస్తవం గ్రహించాలి
- ప్రత్యర్థిని వీలైనంత త్వరగా మట్టికరిపించాలని భావిస్తాడు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా పలు సూచనలు చేశాడు. దక్షిణాఫ్రికాలో కోహ్లీ ఆట చూశానని చెప్పిన స్టీవ్.. కోహ్లీలో ఉండాల్సిన దానికన్నా కాస్త ఎక్కువ దూకుడుందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ జట్టులోని ఆటగాళ్లంతా తనలాగే ఆడాలని కోరుకుంటాడని, అయితే జట్టులో ఒక్కో ఆటగాడు ఒక్కోలా ఆడుతాడన్న వాస్తవాన్ని గ్రహించాలని సూచించాడు. కోహ్లీలో దూకుడు కెరీర్ లో నేర్చుకున్న దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నాడు. సారథిగా కోహ్లీ ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాడని, జట్టును నడిపే సత్తా కోహ్లీలో ఉందని అన్నాడు.
అయితే రహానె, పుజారా ప్రశాంతంగా ఆడతారని, రోహిత్ కుదురుకున్నాక దూకుడుగా ఆడుతాడని, ఇలా ఒక్కో ఆటగాడు ఒక్కోలా జట్టుకోసం ఆడుతున్నారన్న విషయాన్ని గ్రహిస్తే మరింత మెరుగవుతాడని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. మైదానంలో దిగిన తరువాత సానుకూలంగా ఆడాలని, ప్రత్యర్థిని వీలైనంత త్వరగా మట్టికరిపించాలని కోహ్లీ భావిస్తాడని స్టీవ్ వా తెలిపాడు. ఆసీస్ ను ఆస్ట్రేలియాలో ఎదుర్కోవడం కఠినమని, ఆసీస్ తో టోర్నీలో సవాళ్లకు టీమిండియా సిద్ధపడాలని స్టీవ్ వా హెచ్చరించాడు. ఆసీస్ తో టూర్ లో బ్యాట్స్ మన్, స్పిన్నర్లు కీలకమవుతారని ఆయన సూచించాడు.