Stock market: నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు
- ఘోరంగా నష్టాలపాలైన బ్యాంకింగ్ షేర్లు
- సింఫనీ, ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ లాభాల బాట
- సెన్సెక్స్ 34346.39 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10554.30 పాయింట్ల వద్ద ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 99.36 పాయింట్ల మేర నష్టపోయి 34346.39 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 28.30 పాయింట్లు నష్టపోయి 10554.30 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, రిలయన్స్ నావల్, ఒబెరాయ్ రియాల్టీ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.
ఇక లాభాలను ఆర్జించిన కంపెనీల్లో సింఫనీ, ఆస్ట్రల్ పాలీ టెక్నిక్, వాబ్కో ఇండియా, అవెన్యూ సూపర్మార్ట్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీ ప్రధానమైనవి. కాగా, తొలుత ట్రేడింగ్ ప్రారంభం కాగానే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచీలు దూకుడును ప్రదర్శించాయి. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. కొద్దిసేపటికే ఆవిరైపోయింది. పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోలుదారుల నుంచి మద్దతు కరవయింది. దాంతో మార్కెట్లు 'నెగటివ్' పంథాలో పయనించి చివరకు నష్టాలతో సరిపెట్టుకున్నాయి.