Sridevi: శ్రీదేవి కేసు క్లోజ్...ఆమె ప్రమాదవశాత్తే మరణించారు..దుబాయి ఫోరెన్సిక్ నివేదిక వెల్లడి
- బోనీ కపూర్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన దుబాయి పోలీసులు
- రాత్రి 11 గంటలకు శ్రీదేవి భౌతికకాయం భారత్ చేరుకునే అవకాశం
- శ్రీదేవి ఇంటి వద్ద భారీ సంఖ్యలో అభిమానులు
నటి శ్రీదేవి మరణం చుట్టూ ఇప్పటివరకు ఆవరించిన అనుమానపు తెరలు తొలగిపోయాయి. ఆమె స్పృహ కోల్పోయి ప్రమాదవశాత్తుగానే బాత్ టబ్‌లో పడి చనిపోయారని దుబాయి ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. ఫోరెన్సిక్ నివేదికతో ఏకీభవిస్తున్నట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (డీపీపీ) అధికారులు తెలిపారు. దీంతో ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఇలాంటి కేసుల్లో అనుసరించాల్సిన అన్ని ప్రక్రియలను పూర్తి చేశామని వారు వెల్లడించారు. కాగా, అంతకుముందు ఆమె మరణంపై సమగ్ర దర్యాప్తును పూర్తి చేసిన పిదప శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె కుటుంబానికి అప్పగించేందుకు వారు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇప్పటివరకు ఆమె మరణం గురించి ఆమె భర్త బోనీ కపూర్‌ను గంటల తరబడి విచారించినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజా క్లియరెన్స్ నేపథ్యంలో ఆయనకు కూడా ఈ కేసులో దుబాయి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. దాంతో ఆమె భౌతికకాయాన్ని భారత్ తీసుకెళ్లేందుకు ఆయనకు అనుమతి లభించింది. ఏదేమైనా, శ్రీదేవి మరణం తర్వాత అనేక రకాలుగా తెరపైకి వచ్చిన అనుమానాల నిగ్గు తేలకుండానే ఇలా కేసు క్లోజ్ అయిపోవడం పట్ల పలువురు అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం, రాత్రి 11 గంటలకు ఆమె భౌతికకాయం స్వదేశానికి చేరుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆమెను కడసారిగా చూసేందుకు ముంబయ్, లోఖండ్‌వాలాలోని ఆమె ఇంటి వద్ద అభిమానులు భారీ సంఖ్యలో వేచి ఉన్నారు.